icon icon icon
icon icon icon

కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరమూ కాదు: కేటీఆర్‌

‘తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారు. అలా చేయడం ఆయన జేజమ్మతో కూడా కాదు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 02 May 2024 02:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారు. అలా చేయడం ఆయన జేజమ్మతో కూడా కాదు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన ‘మే’ డే వేడుకల్లో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం పాత్ర మరవలేనిది. సింగరేణి, ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం, యాదాద్రి ఆలయం నిర్మాణంలో కార్మికుల శ్రమ ఉంది. కరోనా సమయంలో కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంత ఇబ్బంది పడ్డారో మరచిపోవద్దు. కార్మికుల కోసం రైళ్లు పెట్టమంటే ప్రధాని మోదీ మానవత్వం చూపలేదు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినా.. మన దగ్గర పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. సెస్‌ల పేరు చెప్పి ప్రజలనుంచి రూ.30 లక్షల కోట్లు వసూలు చేసి.. అందులో రూ.14 లక్షల కోట్లతో అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేశారు. నేను చెప్పింది అబద్ధమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు చేసిన రుణమాఫీ డబ్బులతో పదేళ్లు దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొచ్చు. ఏమైనా అంటే జై శ్రీరాం అంటారు. మనం యాదాద్రి ఆలయం కట్టలేదా? రాజకీయాలకు మతాన్ని వాడుకున్నామా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

‘‘రేవంత్‌ సర్కార్‌ వచ్చిన నాలుగు నెలల్లోనే చేనేత కార్మికులకు చీరల ఆర్డర్లు బంద్‌ పెట్టారు. మళ్లీ సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడేలా చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పు కాదు. కానీ దాని ఆధారంగా ఉపాధి కోల్పోయే ఆటో డ్రైవర్లకు మేలు చేయాలి కదా? ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా.. రిజర్వేషన్లు రద్దు కాకుండా ఉండాలంటే భారాస ఎంపీలు గెలవాలి. భాజపా మళ్లీ గెలిస్తే సింగరేణి, మహారత్న కంపెనీలు.. ఇలా అన్నీ అమ్మేస్తారు. అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్‌రెడ్డి, పదేళ్లు మోసం చేసిన బడే భాయ్‌కి బుద్ధి చెప్పాలి’’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

తెలంగాణ గొంతుకపైనే నిషేధమా?

‘ఇదెక్కడి అరాచకం? ఏకంగా తెలంగాణ గొంతుకైన కేసీఆర్‌ ప్రచారంపైనే నిషేధం విధిస్తారా?’ అంటూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 48 గంటలపాటు కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంపై బుధవారం కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? వేలాది మంది పౌరులు ఫిర్యాదులు చేసినప్పటికీ.. మోదీపై చర్యలు మాత్రం శూన్యం! రేవంత్‌ బూతులు కూడా ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అసభ్యంగా మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరు. బడే భాయ్‌.. ఛోటే భాయ్‌ కలిసి చేసిన కుట్ర కాదా ఇది? కేసీఆర్‌ పోరుబాట చూసి ఎందుకు భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు వణుకుతున్నాయి? మీ అహంకారానికి, అధికార దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. భారాస నాయకుడు మన్నె క్రిశాంక్‌ అరెస్టును కేటీఆర్‌ ఖండించారు. భాజపా, కాంగ్రెస్‌ చేస్తున్న ఈ కక్షసాధింపు చర్యలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img