icon icon icon
icon icon icon

వరంగల్‌ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బుధవారం వేర్వేరుగా జరిగిన వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాల్లో పాత, కొత్త నాయకులు పదవుల కోసం బహిరంగంగానే వాదనలకు దిగారు.

Published : 02 May 2024 02:55 IST

వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట సమావేశాల్లో పదవుల కోసం వాగ్వాదం

రంగంపేట(వరంగల్‌), వర్ధన్నపేట, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బుధవారం వేర్వేరుగా జరిగిన వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాల్లో పాత, కొత్త నాయకులు పదవుల కోసం బహిరంగంగానే వాదనలకు దిగారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య సమక్షంలోనే వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం, సమన్వయంతో పనిచేసేందుకు ప్రతి డివిజన్‌కు 10 మంది పేర్లు ఇవ్వాలని మంత్రి సురేఖ సూచించారు. ఈ క్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వొద్దని స్థానిక నాయకులు స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాసలో పనిచేసిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కొంతసేపు గందరగోళం నెలకొంది. మంత్రి  కలగజేసుకొని శాంతింపజేశారు.

వర్ధన్నపేట నియోజకవర్గ సమావేశంలోనూ పాత, కొత్త నాయకుల మధ్య వివాదం చెలరేగింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, ఎంపీ అభ్యర్థి కావ్య ముందే నాయకులు, కార్యకర్తలు గొడవకు దిగారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన వారిని విస్మరించి, కొత్తగా చేరిన వారికి పదవులెలా ఇస్తారని మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు గొడవ చేశారు. పదేళ్లుగా భారాస నేతల దాడులు, ఒత్తిళ్లను ఎదుర్కొని గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే.. కొత్తగా పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యం ఇవ్వడమేమిటని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజును నిలదీశారు. పార్టీ గెలిచినా.. ఓడినా.. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వర్‌రావులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోకపోతే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం ఖాయమని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img