icon icon icon
icon icon icon

భాజపా, ఆరెస్సెస్‌ను బద్నాం చేస్తే ఊరుకోం

తెలంగాణలో ఏ సర్వే చూసినా భాజపా గెలుస్తుందని తేలడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు ఎక్కడ పోతుందోననే భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 02 May 2024 02:55 IST

రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్‌ కుట్రలో భాగం: బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: తెలంగాణలో ఏ సర్వే చూసినా భాజపా గెలుస్తుందని తేలడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు ఎక్కడ పోతుందోననే భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ విమర్శించారు. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో కమాన్‌ వద్ద కేంద్రమంత్రి మురుగన్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ‘‘రేవంత్‌ భాజపా, ఆరెస్సెస్‌ గురించి హేళన చేసేలా మాట్లాడుతున్నారు. అలాచేస్తే ఇకపై ఊరుకునేదిలేదు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000లో జస్టిస్‌ వెంకటాచలయ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి.. సంబంధిత నివేదికను భాజపా ప్రభుత్వం తొక్కిపెట్టిందని రేవంత్‌ అంటున్నారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే కదా? ఆ సమయంలో ఆ నివేదికను వారు ఎందుకు బయటపెట్టలేదు. తమిళనాడులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్‌.. ఆయన సేవలను గుర్తించి కేంద్ర మంత్రిని చేసిన ఘనత మోదీదే. మహిళల ఖాతాల్లో నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పింఛను, రైతు భరోసా కింద రూ.15,000 ఇస్తానని రేవంత్‌ ఇచ్చారా? ఇవ్వమంటే గాడిద గుడ్డు చూపిస్తారా? కాంగ్రెస్‌ పార్టీ.. పథకం ప్రకారమే రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రజలను భయపెట్టాలని చూస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనే భాజపాకు లేదు. ఏ సర్వే చూసినా భాజపానే గెలుస్తుందని చెబుతున్నాయి. మెజార్టీ సీట్లు రాకుంటే తన పీఠానికి ఎసరొచ్చే ప్రమాదం ఉందని, లేనిది ఉన్నట్లు రేవంత్‌ చెబుతూ ప్రజలను నమ్మించడానికి కష్టపడుతున్నారు. జనం ఆయన మాటలను నమ్మే పరిస్థితిలో లేరు’’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img