icon icon icon
icon icon icon

12 స్థానాలు ఖాయం... శ్రమిస్తే ఇంకా ఎక్కువే

ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలచుకుని అత్యధిక స్థానాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భాజపా నేతలకు దిశానిర్దేశం చేశారు.

Updated : 02 May 2024 06:25 IST

సూక్ష్మ ప్రణాళికతో ముందుకు సాగండి
భాజపా ముఖ్య నేతలతో అమిత్‌షా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలచుకుని అత్యధిక స్థానాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భాజపా నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రచార సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం 12 లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు సానుకూలత ఉందని పార్టీ శ్రేణులు శ్రమిస్తే అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రధాన నేతలు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌, మురళీధర్‌రావు, సునీల్‌బన్సల్‌, చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షులు, 17 లోక్‌సభ స్థానాల కన్వీనర్లు, పార్లమెంట్‌ ప్రభారీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితిని అమిత్‌షా సమీక్షించారు. ‘‘కేంద్ర పథకాల లబ్ధిదారులను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిసి మాట్లాడాలి. ప్రతి ఓటరూ లక్ష్యంగా సూక్ష్మ ప్రణాళికతో ముందుకు సాగండి. రానున్న వారం, పది రోజులు అత్యంత కీలకం. అంతా కష్టపడి పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికలతో వచ్చిన సానుకూల పరిస్థితులను ముందుకు తీసుకెళ్లి అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు కృషి చేయండి. ప్రధానంగా యువత నుంచి సానుకూల స్పందన ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఓటరును పార్టీ తరఫున బాధ్యులు కలవడమే ఈ ఎన్నికల్లో కీలకాంశం’’ అని ఉద్బోధించారు. ఇంటింటికి భాజపా కార్యక్రమం అమలుపై ఆయన చర్చించారు. క్షేత్ర స్థాయిలోని బూత్‌ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. ప్రధానిగా మరోసారి నరేంద్రమోదీ అవసరం అనే అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్నారు. రామమందిరం నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి అంశాలకు ప్రజల నుంచి బలమైన మద్దతు ఉందని వాటిని ప్రముఖంగా ప్రస్తావించాలన్నారు. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ లేవనెత్తిన రాజ్యాంగసవరణ, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు. భారీ బహిరంగసభలు, ర్యాలీలకే పరిమితం కాకుండా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ప్రతి ఓటరుకు చేరువకావడం లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు.  పోలింగ్‌శాతం పెరగడం చాలా అవసరమని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img