icon icon icon
icon icon icon

రాజ్యాంగ మూలసూత్రాలు తుడిచివేసేందుకు భాజపా యత్నం

రాజ్యాంగ మూల సూత్రాలను తుడిచివేయడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు.

Published : 02 May 2024 02:59 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగ మూల సూత్రాలను తుడిచివేయడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. భాజపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రానివ్వకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన ఆక్షేపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య అధ్యక్షతన కార్మిక దినోత్సవాన్ని బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దేశంలో ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, సమాఖ్యస్ఫూర్తికి నష్టం కలిగించే ప్రయత్నం చేసిందన్నారు. పదేళ్లలో అదానీ ఆస్తి రూ.60 వేల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు ఎలా పెరిగింది? ఇది ప్రజలను కొల్లగొట్టి సంపాదించిన ఆస్తికాదా? అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయినప్పుడు దేశంలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాళ్లు 221 మంది ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 2,500కి పెరిగిందనీ.. ఇది కార్మికులు, ప్రజల పొట్టగొట్టి సంపాదించిన ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఆస్తిపై పన్నులు విధించి ఆ డబ్బును ప్రజలకు ఖర్చుపెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీపీఎం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, టి.సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img