icon icon icon
icon icon icon

రిజర్వేషన్లు తొలగిస్తే దేశ సమగ్రతకు దెబ్బ: మంత్రి తుమ్మల

తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే గొప్ప అవకాశం లోక్‌సభ ఎన్నికల రూపంలో వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Published : 02 May 2024 02:59 IST

టేకులపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే గొప్ప అవకాశం లోక్‌సభ ఎన్నికల రూపంలో వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్‌ మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి బలరాంనాయక్‌కు మద్దతుగా భద్రాద్రి జిల్లా టేకులపల్లిలో బుధవారం రాత్రి నిర్వహించిన శంఖారావం బహిరంగ సభకు ఆయన హాజరై మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో తనకు నలభై ఏళ్లుగా అనుబంధం ఉందని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే సింగరేణి, ఎల్‌ఐసీ, రైల్వే వంటి ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేసేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. తాము మళ్లీ గద్దెనెక్కితే రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంటున్నారని.. ఇది దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీస్తుందన్నారు. భారాస వాగ్దానాలు దుమ్ములో కలిసిపోయాయని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే ప్రపంచంలోనే దేశం అగ్రగామి కావడం ఖాయమన్నారు. సభలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. టేకులపల్లి ఎంపీపీ భూక్య రాధ, సైదులునాయక్‌తోపాటు పలువురు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img