icon icon icon
icon icon icon

తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి

పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మిదిన్నరేళ్ల ఎన్‌డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారన్న అంశంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Updated : 02 May 2024 06:22 IST

యూపీఏ, ఎన్‌డీయే హయాంలలో ఎవరేం చేశారో తేలుద్దాం
సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి సవాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మిదిన్నరేళ్ల ఎన్‌డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారన్న అంశంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ప్రెస్‌ క్లబ్‌ లేదా అమరవీరుల స్తూపం లేదంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చర్చకు రావాలన్నారు. సీఎం తన నెత్తిపై ‘గాడిద గుడ్డు’ బొమ్మ పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని ప్రజలు నమ్మరని అన్నారు. బహుశా ప్రజలకు తాను ఇచ్చేది ‘గాడిద గుడ్డు’ మాత్రమేనని ఇలా చేస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికొదిలేశారని, చేసిన, చేయబోయే పనుల గురించి చెప్పడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డితో కలసి కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని మొదట రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఇప్పుడు తన కాళ్ల కింద భూమి కదిలిపోతుండటంతో ఏం చేయాలో తెలియక రోజుకొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గుజరాత్‌ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి పోటీ అని ఆయన అంటున్నారని.. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ భాజపా పౌరుషం చాలని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీది ఇటలీ డీఎన్‌ఏ అని.. అది ఇటలీ నేషనల్‌ కాంగ్రెస్‌ అని విమర్శించారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డిలను చూసి కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు గెలిపించలేదని.. కేసీఆర్‌పై కోపంతో, భారాస కుటుంబ పాలన, అవినీతి కారణంగానే హస్తం పార్టీని గెలిపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో వసూళ్లు చేసి.. దిల్లీకి సూట్‌కేసులు పంపుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ఫేక్‌ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్‌ పార్టీయేనని, దీనికి సీఎం పూర్తి బాధ్యత వహించాలన్నారు. మార్ఫింగ్‌ వీడియోలు సృష్టించినవారు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌ అబద్ధాలు చెబుతుండగా.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని భారాస తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. భాజపాకు తెలంగాణ ప్రజలే రక్షణ కవచమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌, భారాసలను పాతరేయడం ఖాయమన్నారు. ప్రధాని మోదీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ రాజ్యాంగం కావాలో.. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అనుసరించే మోదీ పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భారాస కార్పొరేటర్‌ కల్పన, ఇతర నేతలు భాజపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img