icon icon icon
icon icon icon

106 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 గంటల వరకు పోలింగ్‌

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌  సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 02 May 2024 03:02 IST

లోక్‌సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌  సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు బుధవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిర్వహించాలి. కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ నిర్వహిస్తారు. ఆయా స్థానాల్లో పోలింగ్‌ సమయంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ మిగిలిన అన్నింటిలోనూ సమయాన్ని ఈసీ పొడిగించింది. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండటంతోపాటు పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు గాను.. పోలింగ్‌ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు లేఖలు రాశాయి. ఆ లేఖలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆ వినతులను అధ్యయనం చేసిన మీదట మరో గంట సమయం పొడిగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు నిజామాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌, మెదక్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. అలాగే ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌ అసెంబ్లీ స్థానాలు; పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు; వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి, పరకాల, వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట; మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని డోర్నకల్‌, మహబూబాబాద్‌, నర్సంపేట; ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పోలింగ్‌ 6 గంటల వరకు కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img