icon icon icon
icon icon icon

రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి

రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రజలను కోరారు. గత 40 ఏళ్లుగా రజాకార్ల వారసులు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈసారి హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Published : 02 May 2024 03:02 IST

హైదరాబాద్‌లో కమలం వికసించాలి
ఓల్డ్‌ సిటీ రోడ్‌షోలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయంలో పూజలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రజలను కోరారు. గత 40 ఏళ్లుగా రజాకార్ల వారసులు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈసారి హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో భాజపా గెలిచే 400 ఎంపీ సీట్లలో హైదరాబాద్‌ ఉండాలన్నారు. బుధవారం పాతనగరంలోని లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయం నుంచి సుధా టాకీస్‌ మీదుగా నిర్వహించిన రోడ్‌షోలో అమిత్‌షా పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. అమిత్‌ షా రాత్రి 9.30 గంటలకు లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 25 నిమిషాల పాటు రోడ్‌షో సాగింది. 9.55 గంటలకు శాలిబండ చౌరస్తాకు చేరుకున్నారు. అమిత్‌షా రాకను పురస్కరించుకొని భాజపా కార్యకర్తలు, నాయకులు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. అభ్యర్థి మాధవీలత మాట్లాడిన తర్వాత 9.58 గంటలకు అమిత్‌షా ప్రసంగించారు. హైదరాబాద్‌ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని, ఎవరి మీదా ఎలాంటి దాడులు జరగవని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని జనజీవన స్రవంతిలో కలపాలన్నారు. హిందువులు, ముస్లింలతో పాటు అందరూ కలిసి కమలం గుర్తుకు ఓటేసి మోదీకి మద్దతుగా నిలబడాలన్నారు. ఉజ్జయిని మహాకాళి, భాగ్యలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో కమలం పువ్వు వికసించేలా చేస్తామని అభ్యర్థి మాధవీలత అన్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయని, అవి ఆగాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఎక్కువగా మాట్లాడటానికి సమయం లేదని మళ్లీ కలుద్దామని రాజాసింగ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img