icon icon icon
icon icon icon

భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌

భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌ పనిచేస్తోందని తాము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 03 May 2024 03:05 IST

విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మోదీ, అమిత్‌షాలపై చర్యలేవీ?
రేవంత్‌రెడ్డి బూతులు ప్రవచనాల్లా ఉన్నాయా?
స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేసేలా ఈసీ తీరు: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌ పనిచేస్తోందని తాము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా దారుణంగా వ్యాఖ్యలు చేసి విద్వేషాలు సృష్టిస్తుంటే.. వారిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. గురువారం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో, మూసాపేట, శ్రీరామ్‌నగర్‌ రోడ్‌షోలలో మాట్లాడారు. భాజపా సామాజిక మాధ్యమ వేదికగా ముస్లింలపై నేరుగా విషం చిమ్ముతూ పోస్టులు పెడుతున్నా, ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని మోదీ ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా దేవుడి ఫొటో పెట్టుకొని ప్రచారం చేసినా.. భాజపా అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో రాముడి ఫొటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నా.. ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్‌ నిలదీశారు. వీరి వ్యాఖ్యలపై దాదాపు 20 వేల ఫిర్యాదులు వచ్చినా.. కనీసం మోదీకి నోటీసులు ఇవ్వడానికి కూడా ఎన్నికల కమిషన్‌ భయపడుతోందని, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు నోటీసులు ఇచ్చి సరిపెట్టిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. కానీ, కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించేందుకు మాత్రం.. ఈసీ ఆగమేఘాల మీద స్పందించి నోటీసులు ఇచ్చిందని కేటీఆర్‌ అన్నారు. ఉస్మానియా వర్సిటీలో నీళ్లు, కరెంటు బంద్‌ అంశంలో తప్పుడు డాక్యుమెంట్‌ సృష్టించిందే సీఎం రేవంత్‌ అని ఆరోపించారు. తప్పు చేసిన ముఖ్యమంత్రిని వదిలేసి.. ఆ తప్పును ప్రశ్నించిన క్రిశాంక్‌ను జైలుకు పంపించడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.

ఓటు ద్వారానే ప్రజలు సమాధానం చెప్పాలి

‘ఇటీవల సిరిసిల్లలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ను కలిసిన నేతన్నలు.. తమకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం లేదని ఆవేదనతో చెబితే దానిపై ఆయన స్పందించారు. నేతన్నలు నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే.. దాన్ని ఖండిస్తూ కేసీఆర్‌ కొంచెం కఠిన పదం వాడారు. దానిపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయగానే.. ఎన్నికల కమిషన్‌ వేగంగా స్పందించి కేసీఆర్‌పై చర్యలు తీసుకుంది. మరి రేవంత్‌రెడ్డి అనేక వేదికలపై దుర్భాషలాడారు. అధ్వానమైన భాష వాడారు. ఆయన మాటలు నీతి సూక్తులు, ప్రవచనాలు, సుభాషితాలా? రేవంత్‌రెడ్డి మీద 8 సహా కాంగ్రెస్‌ నాయకులపై మొత్తం 27 ఫిర్యాదులు చేశాం. ఒక్క మంత్రి కొండా సురేఖను మందలించారంతే. మిగతా ఎవ్వరిపైనా చర్య తీసుకోలేదు ఎందుకు? రాజ్యాంగం ఇచ్చిన స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోంది. కేసీఆర్‌ రోడ్‌షోల్లో ‘ఛోటే భాయ్‌.. బడే భాయ్‌’ల మోసాలను పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీన్నిచూసి కాంగ్రెస్‌, భాజపాలకు దడ పుట్టింది. ఆ పార్టీలు చేస్తున్న కుట్రలకు ప్రజలు ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్‌ అన్నారు.


నేను చెప్పింది తప్పైతే.. జైలుకు వెళ్లడానికి సిద్ధం

‘ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీళ్లు, కరెంటు సమస్యలపై విద్యార్థుల ఆందోళన అంశం కేసీఆర్‌ దృష్టికి రావడంతో.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దీనిపై సీఎం రేవంత్‌ స్పందించి.. 2023 మే నెలలోనూ ఇలాగే చేశారంటూ మరో పోస్ట్‌ చేశారు. నిజానికి గతేడాది మే నెలలో ఇచ్చిన నోటీసులో నీళ్లు, కరెంటు అంశాలు లేవు. రేవంతే ఆ అంశాలను చేర్చి.. తప్పుడు డాక్యుమెంట్‌ను పోస్ట్‌ చేశారు. దీనిపై ఉస్మానియా విద్యార్థులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించింది సీఎం అయితే.. దాన్ని ప్రశ్నించిన మా నాయకుడు క్రిశాంక్‌ను అరెస్టు చేశారు. నేను చెప్పింది తప్పయితే.. చంచల్‌గూడ జైలుకి వెళ్లటానికి సిద్ధం. లేదంటే రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్తారా?  వెంటనే ఈసీ స్పందించి, తప్పుడు డాక్యుమెంట్‌ సృష్టించిన రేవంత్‌రెడ్డిని జైల్లో పెట్టాలి’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img