icon icon icon
icon icon icon

దిల్లీ పోలీసులు X హైదరాబాద్‌ పోలీసులు

ఉదయాన్నే గాంధీభవన్‌కు దిల్లీ పోలీసులు.. మరోవైపు హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసుల అదుపులో కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ విభాగం వారియర్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్‌ కేసుకు సంబంధించి గురువారం హైడ్రామా నడిచింది.

Published : 03 May 2024 03:06 IST

 అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో హైడ్రామా

ఈనాడు, హైదరాబాద్‌: ఉదయాన్నే గాంధీభవన్‌కు దిల్లీ పోలీసులు.. మరోవైపు హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసుల అదుపులో కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ విభాగం వారియర్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్‌ కేసుకు సంబంధించి గురువారం హైడ్రామా నడిచింది. ఈ కేసు విషయమై దిల్లీ పోలీసులు గురువారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చారు. సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన వారెవరూ అందుబాటులో లేకపోవడంతో వారు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో నగర సైబర్‌క్రైం పోలీసులు కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్‌ మన్నె సతీశ్‌, గీత, నవీన్‌, అస్మా తస్లీం, శివ తదితరుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని తొలుత సీసీఎస్‌కు.. తర్వాత సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ ఠాణాకు తరలించి సాయంత్రం వరకూ అక్కడే ఉంచారు. దిల్లీ పోలీసులు సైబర్‌క్రైం స్టేషన్‌ ఉండే సీసీఎస్‌ భవనం పరిసరాల్లోనే ఎదురుచూశారు. అమిత్‌షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్‌ అంశంపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి గత నెల 27న సైబర్‌క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వారియర్లను సీసీఎస్‌లోనే ఉంచారా అనే అంశంపై స్పందించలేదు.

 విచారణకు రాజకీయ నాయకుల డుమ్మా

దిల్లీ: అమిత్‌ షాకు సంబంధించి నకిలీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారన్న ఆరోపణలపై విచారణకు రాజకీయ పార్టీల సభ్యులెవరూ తాజాగా దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల ఎదుట హాజరు కాలేదు. ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లోని కొందరు నాయకులతోపాటు ఈశాన్య భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని గురువారం విచారణకు తాము రమ్మన్నామని.. కానీ వారిలో ఒక్కరు కూడా రాలేదని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇదే కేసులో బుధవారం తమ ఎదుట హాజరు కాని తెలంగాణ కాంగ్రెస్‌ సభ్యులకు రెండో నోటీసు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కూడా ఈ వ్యవహారంలో సమన్లు జారీ అవగా.. ఆయన తరఫు న్యాయవాది దర్యాప్తు అధికారి ఎదుట బుధవారం హాజరైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img