icon icon icon
icon icon icon

దిల్లీ సుల్తాన్లకు భయపడం

‘రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే దిల్లీ పోలీసులతో అమిత్‌షా కేసు పెట్టించారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఎన్నో కేసులు పెట్టారు.

Published : 03 May 2024 03:10 IST

అప్పట్లో కేసీఆర్‌ నన్ను జైలుకు పంపితేనే భయపడలేదు
రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
కులగణనను అడ్డుకునేందుకు మోదీ, అమిత్‌షాల పన్నాగం
సిద్దిపేటకు మళ్లీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా
ఆసిఫాబాద్‌ సభ, సిద్దిపేట, కుత్బుల్లాపూర్‌ రోడ్‌షోలలో సీఎం రేవంత్‌

ఈనాడు, హైదరాబాద్‌, ఈటీవీ, ఆదిలాబాద్‌; సిద్దిపేట, సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట టౌన్‌, కుత్బుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ‘రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే దిల్లీ పోలీసులతో అమిత్‌షా కేసు పెట్టించారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఎన్నో కేసులు పెట్టారు. నన్ను చర్లపల్లి జైలుకు పంపించారు. అయినా భయపడలేదు. ఇప్పుడు దిల్లీ సుల్తాన్లకు భయపడే ప్రసక్తేలేదు. రక్తాన్ని ధారబోస్తూ కాంగ్రెస్‌ జెండా ఎత్తిన కార్యకర్తల అండదండలు, రాంజీగోండ్‌, కుమురంభీం పోరాట వారసత్వం కలిగిన ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల ఆశీస్సులుంటే దిల్లీ సుల్తాన్లకు నేను భయపడాలా’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన.. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో జరిగిన జనజాతర సభలో మాట్లాడారు. మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో రాత్రి రోడ్‌షో నిర్వహించారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని షాపూర్‌నగర్‌ చౌరస్తాలో రాత్రి ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లోనూ ప్రసంగించారు.  రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల ఆధిక్యం సాధించాలని, పార్లమెంట్‌లో మెజార్టీ లేకపోతే అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను భాజపా కూలగొట్టిందని ఆరోపించారు. ‘‘బ్రిటిషోళ్ల పాలనలో 1881 నుంచి జనాభా లెక్కల తీయటం ప్రారంభమైంది. అప్పటి నుంచి పదేళ్లకోసారి జనగణన జరిపే సంప్రదాయం కొనసాగింది. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 లెక్కలు తీయటం ఆగిపోయింది. కులగణన జరిగి ఉంటే 27శాతం ఉన్న బీసీల రిజర్వేషన్‌ ఇప్పటికే 50శాతం దాటి ఉండేది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం లబ్ధి చేకూరేది. భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లకు తూట్లు పొడవడం ఖాయం. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్న భాజపాను రద్దు చేయాలా.. లేదా అన్నది ఓటర్ల చేతిలోనే ఉంది. ప్రజలు ఆలోచించి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్‌ను ఆదరించండి’’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పదేళ్ల మోదీ ప్రభుత్వం, కేసీఆర్‌  ప్రభుత్వం పేదల బతుకుల గురించి ఆలోచించలేదని అన్నారు.

ఆదిలాబాద్‌ అంటే అభిమానం

‘‘నాకు ఆదిలాబాద్‌ జిల్లా అంటే అత్యంత అభిమానం. నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యాక మొదటిసారి ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద సభ నిర్వహించాం. 1981 ఏప్రిల్‌ 20న జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన ఆదివాసీ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆసిఫాబాద్‌ గుండి వంతెనను పూర్తిచేస్తాం. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు న్యాయం చేస్తాం. ఆదిలాబాద్‌లో సిమెంటు పరిశ్రమను ఏర్పాటుచేస్తాం. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ఆత్రం సుగుణను లక్ష ఓట్ల ఆధిక్యతతో గెలిపించాలి’’ అని రేవంత్‌ కోరారు.

మోదీకి కేసీఆర్‌ స్పీచ్‌ల కాపీ ఇచ్చారు

‘పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని నేనంటే చేయలేరని భారాస నేత హరీశ్‌రావు అంటున్నారు. కొమురవెల్లి మల్లన్నసాక్షిగా పంద్రాగస్టులోపు ఈ రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ అమలు చేస్తాం. తెలంగాణ రైతులను ఆదుకునే బాధ్యత నాది. సిద్దిపేటకు ఆయన శనిలా దాపురించారు. నీ లెక్క, పత్రం తేల్చుతా. రుణమాఫీ చేసి మళ్లీ ఇక్కడే లక్ష మంది రైతులతో సమావేశం పెడతా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘మొన్న మెదక్‌ జిల్లాకు వచ్చిన ప్రధానికి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు.. కేసీఆర్‌ మాట్లాడే స్పీచుల కాగితం కాపీలను ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నో మంచి పనులు చేశాను కాబట్టి పెద్దమనిషిగా, పెద్దన్నగా ‘పిలగాడు బాగా చేసిండు’ అంటారేమో అనుకున్నా. అదేమీ లేకుండా వచ్చి తిట్టిపోయారు. రాష్ట్ర అవసరాలను గతంలో ఆయన ముందు పెడితే ప్రధాని మోదీ ఏం ఇచ్చారంటే గాడిద గుడ్డే. అందుకే ఆ పార్టీ వారికి ఓటు వేయకుండా కర్రుకాల్చి వాతపెట్టాలి’’ అని అన్నారు.

వెంకట్రామిరెడ్డికి ఎందుకు ఓటేయాలి?

‘45 ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామ, అల్లుడు పట్టిపీడిస్తున్నారు. అరుంధతి సినిమాలో బొమ్మాళి మాదిరి సిద్దిపేటలో యువకులు, వ్యాపారులు, ప్రజలను పట్టిపీడిస్తున్న నేత నుంచి విముక్తి కల్పించేందుకు సిద్దిపేట గడ్డమీదికి వచ్చా. మీకు అండగా నిలబడతా’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘గౌడన్నలు, నేతన్నలు, గీతన్నలు, యాదవ సోదరులు, ముదిరాజ్‌ బిడ్డలకు కష్టనష్టాల్లో అండగా ఉండే నీలం మధు కావాలా? లేకపోతే భూములు గుంజుకుని మల్లన్నసాగర్‌లో ముంచి అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కుపాదాలతో తొక్కించి, లాఠీ ఛార్జీలు చేయించిన అభ్యర్థి కావాలా అనేది ఆలోచించండి. సిద్దిపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా నిలబడి నామినేషన్లు వేస్తే పోలీసులతో బెదిరిస్తారు.. ఇక్కడ సర్పంచిగా నిలబడితే పోలీస్‌స్టేషన్‌లో వేసి కొడతారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడాలంటే అక్రమ కేసులు పట్టి జైళ్లకు తోలుతారు. ఎన్నిరోజులు ఈ దౌర్జన్యం నడుస్తుందనేది ఆలోచన చేయాలి. సిద్దిపేట గడ్డపై మూడు రంగుల జెండా ఎగురకపోతే శాశ్వతంగా సిద్దిపేట ప్రాంత ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఎవరు ఈ వెంకట్రామిరెడ్డి(భారాస అభ్యర్థి)? ఏ ఊరు ఆయనది? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రజలకు ఏం చేశారని ఓటేయాలి? మామ, అల్లుడు.. వెంకట్రామిరెడ్డి నగదు చూసి టికెట్‌ ఇచ్చారా? ఇక్కడ భూములు గుంజుకొని, కొల్లగొట్టి ఆయన వందల ఎకరాలను ఆక్రమించుకున్నారు. ఆయన రాజ్‌పుష్ప సంస్థను నిర్వహిస్తున్నారు. నిజాం వద్ద ఖాసిం రజ్వి ఎలాగో కేసీఆర్‌, హరీశ్‌రావు వద్ద వెంకట్రామిరెడ్డి అలానే పని చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారు. అలాంటి వ్యక్తిని కరీంనగర్‌ నుంచి తెచ్చి ఎంపీగా నిలబెడితే ఓటేయడానికి ఇక్కడి ప్రజలు అమాయకులా? ఆ అభ్యర్థికి డిపాజిట్‌ గల్లంతు చేయాలని ప్రజలకు కోరుతున్నా. రఘునందన్‌రావు దిల్లీ నుంచి రూ.వందల కోట్లు తెస్తామంటే ప్రజలు అప్పట్లో ఆయనకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. రైతులు, నిరుద్యోగ యువతకు ఆయన గాడిదగుడ్డు ఇచ్చారు. భారాస, భాజపా రుచి, వాసన, ఆలోచనలు ఒక్కటే. పగటిపూట రెండు పార్టీలు.. రాత్రిపూట ఒక్కటే పార్టీ’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

మోదీ, అమిత్‌షాలకే ఉద్యోగాలొచ్చాయ్‌..!

‘‘చదువులు పూర్తి చేసుకున్న యువకులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవి కాగితాలపైనే ఉన్నాయి. ప్రధానమంత్రిగా పదేళ్లపాటు వ్యవహరించిన నరేంద్రమోదీ 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మోదీకి, అమిత్‌షాకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పదేళ్లలో కేంద్రం రూపాయి విలువ చేసే పనులు ఇవ్వలేదని ఆరోపించారు. హైదరాబాద్‌ నగరంలో మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు నిరాకరించిందని, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ఏకంగా రద్దు చేసిందని విమర్శించారు. ‘‘పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామంటూ గతంలో కేసీఆర్‌ ప్రకటించారు. కొన్ని ఇళ్లు నిర్మించారు. వాటిలో చాలా అవినీతి జరిగింది. పదేళ్ల అధికారంలో వందేళ్ల విధ్వంసం సృష్టించిన కేసీఆర్‌ను ఓడించాం. భాజపాకు మద్దతిస్తే సంక్షోభ పరిస్థితులు వస్తాయి. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే సీఎం పదవి దక్కింది. నాకు ఓటేసి గెలిపించినట్టే.. పట్నం సునీతారెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమాలలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.


పంద్రాగస్టు నాడు దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అదే రోజు హరీశ్‌రావు నుంచి సిద్దిపేటకు స్వాతంత్య్రం రాబోతోంది. అదే రోజు రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి రైతులకు స్వాతంత్య్రం రాబోతోంది. కాసుకో.. పంద్రాగస్టు వరకే ఈ గడ్డపై నీ(హరీశ్‌రావు) ఆటలు. సిద్దిపేటకు మళ్లీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. రాజీనామాకు సిద్ధంగా ఉండు.   

 సీఎం రేవంత్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img