icon icon icon
icon icon icon

పదేళ్లు మోసం చేసిన పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు: మంత్రి ఉత్తమ్‌

తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిన పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 03 May 2024 04:45 IST

మోతె, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిన పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భాజపా, భారాసలకు ఓట్లేస్తే పనికిరాకుండా పోతాయని, ఓటు వృథా కాకూడదంటే కాంగ్రెస్‌కే వేయాలని తెలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస కనపడదని జోస్యం చెప్పారు. జిల్లాలో అభివృద్ధి పనులు జానారెడ్డి, ఉత్తమ్‌, కోదాడ నియోజకవర్గంలో చందర్‌రావు, పద్మావతిరెడ్డిల హయాంలోనే జరిగాయని, జగదీశ్‌రెడ్డి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందని, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌తో సహా 11 మందితో ఉన్న మంత్రివర్గం ఓ క్రికెట్‌ జట్టులాగా సమష్టి నాయకత్వం, నిర్ణయాలతో ప్రజలకు మేలు చేకూర్చేలా ముందుకు వెళుతోందన్నారు. ఈ ఎన్నికలు కాగానే అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు, ఇళ్లు లేనివారికి ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ఎంపీపీ ఆశా, జడ్పీటీసీ సభ్యుడు పుల్లారావు, సంతోష్‌రెడ్డి, గుర్వారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img