icon icon icon
icon icon icon

తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయనుంది.

Published : 03 May 2024 04:47 IST

నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీన్ని ఆవిష్కరిస్తారు. గాంధీభవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తుందనే విషయాలను ఈ మ్యానిఫెస్టో ద్వారా వివరించనున్నారు. ఇప్పటికే జాతీయస్థాయిలో ‘న్యాయ్‌ పత్ర’ పేరుతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. రాష్ట్ర పునర్విభజన హామీలైన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా, కనీసం ఒక్క ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐడీ విద్యాలయం, 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు సరైన వాటా, స్మార్ట్‌ సిటీలుగా వరంగల్‌, కరీంనగర్‌, మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు జాతీయ హోదా హామీలు మ్యానిఫెస్టోలో ఉండనున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్‌ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు హామీలు ఉండనున్నాయి. హైదరాబాద్‌- వరంగల్‌, హైదరాబాద్‌- కరీంనగర్‌, హైదరాబాద్‌- బెంగళూరు, హైదరాబాద్‌- నల్గొండ ఐటీ కారిడార్ల నిర్మాణం, తెలంగాణకు కొత్తగా రెండు విమానాశ్రయాలు మంజూరుతో పాటు ప్రస్తుతం రన్‌వేగా మాత్రమే ఉపయోగపడుతున్న వరంగల్‌, రామగుండం, తదితర విమానాశ్రయాల విస్తరణ అంశాలు ఇందులో పొందుపరిచినట్లు సమాచారం.

సీఎం రేవంత్‌ను కలిసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిశారు. బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం ఉదయం సీఎంను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌధరి, విష్ణునాథ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులున్నారు.


‘దిల్లీ దర్బార్‌’ పేరిట కాంగ్రెస్‌ ప్రచార వీడియో విడుదల

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ఆయా పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌ గురువారం సోషల్‌ మీడియాలో ‘దిల్లీ దర్బార్‌’ పేరుతో వినూత్నమైన వీడియో విడుదల చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నిధులు రాష్ట్రాలకు కేటాయించడంలో వివక్ష చూపిస్తోందని చెప్పే ప్రయత్నం చేశారు. గుజరాత్‌ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తున్నట్లు, తెలంగాణకు ‘గాడిద గుడ్డు’ ఇస్తున్నట్లు చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img