icon icon icon
icon icon icon

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సీబీఐకి అప్పగించాలి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు.

Published : 03 May 2024 04:50 IST

నన్ను ఓడించేందుకు కాంగ్రెస్‌, భారాస కుట్ర
ఎంపీ బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. గతంలో డ్రగ్స్‌, మియాపూర్‌ భూముల కుంభకోణం, టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసుల తరహాలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును మూసివేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్‌ పంథానే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌.. వ్యక్తిగత స్వేచ్ఛపై జరిగిన దాడి అని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి, అవసరమైతే ఎన్‌ఐఏకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఫోన్‌ ట్యాపింగ్‌లో ప్రభుత్వం భారాసతో కుమ్మక్కైందని తేలిపోతుందన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్‌, భారాసలు కుమ్మక్కై ఎదురుదాడి చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఫోన్‌ ట్యాపింగ్‌ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని, ఇది బయటకు రావడంతో కేసీఆర్‌ కుటుంబం ఓ మంత్రితో ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని రాధాకిషన్‌రావు పోలీసుల విచారణలో వెల్లడించారని, దానికి ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ (కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ సర్టిఫైడ్‌ కాపీ) రుజువని అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు తాను, సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాన బాధితులమన్నారు. ప్రభాకర్‌రావు ఇండియాకు తిరిగొచ్చేలా చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయన అమెరికా నుంచి తిరిగి రాకూడదనే భారాస, కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావు కరీంనగర్‌లో మకాం వేసి ఫోన్లు ట్యాప్‌ చేశారన్నారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి టికెట్‌ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్‌రావు అని అన్నారు. రెండు పార్టీలు ఒక్కటై కరీంనగర్‌లో తనను ఓడించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే తనవద్ద ఉన్న సమాచారం అంతా ఇస్తానని సంజయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img