icon icon icon
icon icon icon

భాజపాతో జోడీ కడితే సరి.. లేదంటే ఈడీ

భాజపాతో దోస్తీ కట్టకపోవడం వల్లే ఎమ్మెల్సీ కవితను దిల్లీ మద్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Published : 03 May 2024 04:53 IST

కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది
మైనారిటీలను కాంగ్రెస్‌ మంత్రివర్గంలోకి తీసుకోలేదెందుకు?
మాజీ మంత్రి హరీశ్‌రావు

హత్నూర, గుమ్మడిదల, న్యూస్‌టుడే: భాజపాతో దోస్తీ కట్టకపోవడం వల్లే ఎమ్మెల్సీ కవితను దిల్లీ మద్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, హత్నూర మండలం దౌల్తాబాద్‌లలో గురువారం రాత్రి భారాస ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షోల్లో ఆయన ప్రసంగించారు. భాజపాతో జోడీ కడితే మంచిది.. లేదంటే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, భాజపా దోస్తీ కట్టాయని.. ఆ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చెక్‌ బౌన్స్‌ అయినప్పుడు దానిని ఇచ్చిన వ్యక్తిపై ఎలాగైతే చర్యలు ఉంటాయో.. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి ప్రజల్ని మోసం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్షతోపాటు తులం బంగారు ఇస్తామని ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి హమీ ఇచ్చారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లక్షల్లో పెళ్లిళ్లు అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు లక్షల తులాల బంగారం బాకీ పడిందని పేర్కొన్నారు. భారాస ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు చట్టసభల్లో పెద్దపీట వేశామని.. మహమూద్‌ అలీని ఉప ముఖ్యమంత్రిని చేశామన్నారు. ప్రస్తుతం 12 మందితో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పెద్దలు మైనారిటీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్‌ గద్దె దిగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి మెదక్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. పటాన్‌చెరు, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img