icon icon icon
icon icon icon

కొండా వినతిపత్రాన్ని పరిశీలించి పరిష్కరించండి

బ్యాలెట్‌లో మార్పులు చేయాలంటూ చేవెళ్ల నియోజకవర్గ భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం హైకోర్టు సూచించింది.

Published : 03 May 2024 04:54 IST

బ్యాలెట్‌లో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈసీకి హైకోర్టు సూచన

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాలెట్‌లో మార్పులు చేయాలంటూ చేవెళ్ల నియోజకవర్గ భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం హైకోర్టు సూచించింది. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకే పేరుతో ఇద్దరు నామినేషన్‌ వేసినందున ఒక్కో పేరు మధ్య కనీసం 10 నంబర్ల గ్యాప్‌ ఉంచుతూ బ్యాలెట్‌ పేపర్‌లో మార్పులు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.వి.భానుప్రసాద్‌, న్యాయవాది కె.విజయభాస్కర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పిటిషనర్‌తోపాటు 46 మంది నామినేషన్లు దాఖలు చేశారన్నారు. పిటిషనర్‌ పేరు ఉన్న మరో వ్యక్తి కూడా నామినేషన్‌ దాఖలు చేశారన్నారు. జాబితాలో సీరియల్‌ నంబరు 2గా పిటిషనర్‌ పేరు ఉందని, అయిదో పేరుగా ఆ వ్యక్తి పేరు ‘కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తండ్రి కాంతారెడ్డి’ అని ఉందన్నారు. పిటిషనర్‌ ప్రచారానికి వెళుతుంటే 5వ నంబరు అభ్యర్థా అని అడుగుతున్నారన్నారు. ‘కొండా విశ్వేశ్వర్‌రెడ్డి’ పేర్లు రెండూ ఒకేచోట ఉన్నట్లయితే ఓటర్లు అయోమయంలో పడతారన్నారు. తమ పేర్ల మధ్య కనీసం 10 నంబర్ల వ్యత్యాసం ఉండేలా బ్యాలెట్‌ పేపరులో మార్పులు చేసేలా ఆదేశించాలని కోరారు. దీనికి సంబంధించి గత నెల 30న ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించామన్నారు. వినతిపత్రంపై నిర్ణయం తీసుకునేదాకా సీరియల్‌ నంబర్లు కేటాయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ వినతిపత్రాన్ని పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం బ్యాలెట్‌ పేపర్‌లో మార్పులు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్‌ సమర్పించిన వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచిస్తూ      పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img