icon icon icon
icon icon icon

విద్యుత్‌ కోతలంటూ భారాస నాటకాలు

రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేనేలేవని, నిరంతరాయంగా సరఫరా చేస్తున్నా.. కరెంట్‌ కోతలు ఉన్నాయంటూ భారాస నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Published : 04 May 2024 03:34 IST

గత ఏడాది కంటే ఎక్కువ కరెంటు సరఫరా చేస్తున్నాం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేనేలేవని, నిరంతరాయంగా సరఫరా చేస్తున్నా.. కరెంట్‌ కోతలు ఉన్నాయంటూ భారాస నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంటు పోతుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు భారాస నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం భారాస సమావేశాల్లో కరెంట్‌ కట్‌ అయినట్లు వారు నాటకాలాడుతున్నారని భట్టి విమర్శించారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు రాష్ట్రమంతటా గతేడాదికన్నా ఎక్కువ విద్యుత్తును సరఫరా చేశామని వివరించారు. 2022 డిసెంబరు నుంచి 2023 ఏప్రిల్‌ వరకు భారాస పాలనలో రాష్ట్రంలో మొత్తం 36,207 మిలియన్‌ యూనిట్లు(మి.యూ) విద్యుత్తు సరఫరా కాగా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబరు నుంచి 2024 ఏప్రిల్‌ 30 వరకు 38,155 మి.యూ. సరఫరా చేశామని వివరించారు. ఒకరోజు గరిష్ఠ డిమాండ్‌ 15,497 మెగావాట్లకు చేరినా కోతల్లేకుండా చేసినట్లు వెల్లడించారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో అక్కడక్కడా లోడ్‌ పెరిగి ఒక్కోసారి కరెంటు సరఫరాలో సాంకేతిక అవాంతరాలు తలెత్తితే సిబ్బంది పరిష్కరిస్తున్నారని తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి ఏప్రిల్‌ 30 వరకు భారాస పాలనలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పరిధిలో 1369 సార్లు 11 కేవీ లైన్లు ట్రిప్‌ అయి 580 గంటలు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వాటిల్లిందన్నారు. ఈ ఏడాది అదేవారంలో 272 చోట్ల 11 కేవీ లైన్లు ట్రిప్‌ అయి 89 గంటలు మాత్రమే సరఫరాలో అంతరాయం కలిగిందని చెప్పారు. గత ఏడాది ఇదేవారంలో 301 ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిలవ్వగా.. ఈసారి 193 విఫలమైనట్లు ఆ ప్రకటనలో భట్టి పేర్కొన్నారు.

మోదీ, నవీన్‌ పట్నాయక్‌ ఒడిశాకు నష్టం చేస్తున్నారు

ఒడిశాలో మోదీ, నవీన్‌ పట్నాయక్‌లు కలిసి ఉంటూ.. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒడిశా రాష్ట్రం రాయగడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలకు వేదాంత కంపెనీ సిద్ధం కాగా రాహుల్‌గాంధీ వచ్చి ఓ సైనికుడిలా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఒడిశా వనరులు స్థానిక ప్రజలకే చెందాలని రాహుల్‌గాంధీ గట్టిగా చేసిన పోరాటం వల్లనే బాక్సైట్‌ గనులు సురక్షితంగా ఉన్నాయని భట్టి చెప్పారు. రాహుల్‌ ఈ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉన్నా రాయబరేలిలో నామినేషన్‌ కార్యక్రమం ఉండటంతో రాలేకపోయినట్లు తెలిపారు. దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కొద్దిమంది మిత్రులకు మోదీ పంచి పెట్టడాన్ని రాహుల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇండియా కూటమిని గెలిపించి దేశ సంపదను కాపాడుకుందామని భట్టి పిలుపునిచ్చారు. ఈ సభకు తెలుగువారు పెద్దఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్‌ పెద్దలు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఏఐసీసీ నాయకులు భక్త చరణ్‌దాస్‌, ఆర్‌.సి.కుంతియా, మీనాక్షి నటరాజన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img