icon icon icon
icon icon icon

రేవంత్‌రెడ్డి అరెస్టుకు కుట్ర: మధుయాస్కీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడానికి కుట్రలు చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ ఆరోపించారు.

Published : 04 May 2024 03:35 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడానికి కుట్రలు చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్‌షాలు అనేక అబద్ధాలు, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని, అయినా వారి మీద ఎందుకు కేసులు లేవని ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటికీ కొందరు అధికారులు భారాసకు బీటీంగా పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) శుక్రవారం మధుయాస్కీ గౌడ్‌తో ‘మీట్‌ ది ప్రెస్‌’ నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చుతామని విపక్ష పార్టీలు పదేపదే బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు జరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్నదంతా నరేంద్రమోదీ ట్యాక్స్‌. ఆ నిధులను పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారు. కేంద్రంలో మళ్లీ భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయం’’ అని మధుయాస్కీ పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అన్నారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల కేసును ప్రస్తుతం కోర్టు ముగించినా.. ఏవైనా బలమైన ఆధారాలు లభిస్తే కేసును తెరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img