icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పస లేదు

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పసలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే బయ్యారం ఉక్కు కర్మాగారం హామీ అమలు చేస్తామంటోందని విమర్శించారు.

Published : 04 May 2024 03:35 IST

గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తు
ఎన్నికల ముందే చేతులెత్తేసిన భారాస
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పసలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే బయ్యారం ఉక్కు కర్మాగారం హామీ అమలు చేస్తామంటోందని విమర్శించారు. తెలంగాణలోని ఐదు గ్రామాలను ఏపీలో కలపడం కాంగ్రెస్‌ నిర్ణయమేనని ఆరోపించారు. కేసీఆర్‌ గతంలో తాను ఇచ్చిన హామీలకు మసిపూసి మారేడుకాయ చేసేవారని.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి గాడిదగుడ్డు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తన గుర్తును గాడిద గుడ్డుగా మార్చుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే భాజపాపై కాంగ్రెస్‌ బురద చల్లుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు.

కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన రావడమే రాష్ట్రంలో వచ్చిన మార్పా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే భారాస చేతులెత్తేసిందన్నారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ఇతర నేతలతో కలసి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీ అవినీతి మార్కును సీఎం రేవంత్‌రెడ్డి చూపిస్తున్నారు. రైల్వేలకు యూపీఏ హయాంలో ఎన్ని నిధులిచ్చారో.. మోదీ వచ్చాక ఎన్ని నిధులిచ్చామో చర్చించేందుకు రావాలి. ఎల్కుర్తి గ్రామంలో 2017లోనే కేంద్రం సైనిక్‌ స్కూల్‌ మంజూరు చేసింది. అప్పటి భారాస ప్రభుత్వం సహకరించకపోవడంతో ఏర్పాటు కాలేదు. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తామంటోంది. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో 28,942 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కాంగ్రెస్‌ చెప్పుకొంటోంది. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన నియామకాలకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి తన ఖాతాలో వేసుకుంటోంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కర్త, కర్మ, క్రియ కేంద్రంలోని భాజపా ప్రభుత్వమే. దీన్ని కూడా కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకున్నారు. కొత్తగా తెల్ల రేషన్‌కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు రూ.10 లక్షల ప్రమాదబీమా మాటలకే పరిమితమయ్యాయి. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ ఎందరికి ఇచ్చారు? ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని పెట్టెల్లో దాచగా.. మరికొన్ని చెత్తకుప్పల్లో పడేశారు. భాజపాకు రాష్ట్రంలో రెండంకెల ఎంపీ స్థానాలు వస్తాయి. మోదీ సునామీలో కాంగ్రెస్‌ కొట్టుకుపోవడం ఖాయం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img