icon icon icon
icon icon icon

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం

రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం’ పేరుతో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను శుక్రవారం ప్రకటించింది.

Published : 04 May 2024 03:35 IST

విభజన చట్టం హామీలు అమలు చేస్తాం
ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలు వెనక్కి..
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌
పాలమూరు ఎత్తిపోతల, మేడారం జాతరలకు జాతీయ హోదా
తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం’ పేరుతో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను శుక్రవారం ప్రకటించింది. ఇందులో 23 అంశాలున్నాయి. ఐటీ, పారిశ్రామిక, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనతో అన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగించేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించినట్లు వివరించింది. ‘ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు’ పేరిట ఎన్నికల ప్రణాళికను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి శ్రీధర్‌బాబు గాంధీభవన్‌లో శుక్రవారం విడుదల చేశారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌధరీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, అజారుద్దీన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, చిన్నారెడ్డి, జానయ్య, దానం నాగేందర్‌, రోహిణ్‌రెడ్డి, కోదండరెడ్డి, నిరంజన్‌, మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు హాజరయ్యారు.  కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక.. 23 అంశాలతో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రానికి సంబంధించి ఇస్తున్న హామీలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఆమోదం తీసుకుని మ్యానిఫెస్టోను విడుదల చేశామని కాంగ్రెస్‌ నేతలు వివరించారు.

‘న్యాయ్‌ పత్ర’ పేరుతో ఏఐసీసీ ఇప్పటికే మ్యానిఫెస్టోలోని హామీల్ని ‘ఐదు న్యాయాల’ పేరుతో తెలుగులో కాంగ్రెస్‌ నాయకులు విడుదల చేశారు.  మ్యానిఫెస్టోను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విడుదల చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లడంతో హాజరు కాలేకపోయారు.

తెలంగాణకు ప్రత్యేక హామీలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను రూపొందించింది. ఇందులో 23 హామీలను ఇచ్చింది.

1. హైదరాబాద్‌ మహా నగరంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐటీఐఆర్‌) ప్రాజెక్టు పునఃప్రారంభం
2. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం..

  • కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు
  • బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం
  • హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)
  • హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు
  • మైనింగ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు

3. విలీనమైన గ్రామాలు వెనక్కి: భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అడ్డుగా ఉంది. ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలు-ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నెగూడెం, పిచ్చుకలపాడులను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తాం.
4. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
5. హైదరాబాద్‌లో నీతి ఆయోగ్‌ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు
6. నూతన విమానాశ్రయాల ఏర్పాటు
7. రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్‌ నిర్మాణం
8. నూతనంగా నాలుగు సైనిక్‌ స్కూళ్ల ఏర్పాటు
9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు
10. నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపు
11. జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు
12. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌) ఏర్పాటు
13. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ) ఏర్పాటు
14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్‌ఏ) ఏర్పాటు
15. నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు
16. అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు
17. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ
18. ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడిన సొంత విద్యుదుత్పత్తి వ్యవస్థ
19. పారిశ్రామిక పురోగతికి కారిడార్లు..

  • హైదరాబాద్‌-బెంగళూరు ఐటీ, పారిశ్రామిక కారిడార్‌
  • హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ కారిడార్‌
  • హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌
  • హైదరాబాద్‌-నల్గొండ-మిర్యాలగూడ పారిశ్రామిక కారిడార్‌
  • సింగరేణి పారిశ్రామిక కారిడార్‌

20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు
21. మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా 22. డ్రై పోర్టు ఏర్పాటు
23. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img