icon icon icon
icon icon icon

10 నుంచి 12 సీట్లిస్తే మళ్లీ కేసీఆర్‌ శకం

రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ సీట్లు మాకిస్తే మళ్లీ కేసీఆర్‌ శకం మొదలై రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు.

Updated : 04 May 2024 05:38 IST

సికింద్రాబాద్‌ రోడ్‌ షోలో కేటీఆర్‌ వ్యాఖ్యలు

సికింద్రాబాద్‌, అడ్డగుట్ట, పద్మారావునగర్‌, ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ సీట్లు మాకిస్తే మళ్లీ కేసీఆర్‌ శకం మొదలై రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్‌మండి, మైలార్‌గడ్డ, సనత్‌నగర్‌లోని బన్సీలాల్‌పేట, ఆసిఫ్‌నగర్‌లలో నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన ప్రసంగించారు. 2014లో బడేభాయ్‌ మోదీ చాలా కథలు చెప్పారని, ఖాతాల్లో రూ.15 లక్షలు, ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఇంటికో నల్లా, రైతుల ఆదాయం డబుల్‌, బుల్లెట్‌ ట్రైన్‌ అని అన్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా పైసా పని చేయలేదన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి ఇవ్వలేదని, గుజరాత్‌లో మాత్రం మోదీ ప్రత్యేక విమానంలో వెళ్లి రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని తెలిపారు. నేను చెప్పింది అబద్ధమని కిషన్‌రెడ్డి నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేలు, తులం బంగారం, స్కూటీలు ఇస్తానని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదన్నారు. దానం నాగేందర్‌ తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, ఇప్పుడు భాజపాలోకి వెళ్లరని గ్యారంటీ ఏమిటన్నారు. కేసీఆర్‌కు తమ్ముడులాంటి పద్మారావుగౌడ్‌ను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని, ఎమ్మెల్సీ ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, నాంపల్లి బాధ్యుడు ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img