icon icon icon
icon icon icon

భాజపా, కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌

రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Published : 04 May 2024 05:43 IST

భారాసను లేకుండా చేయాలని కుట్ర
మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ

సిద్దిపేట టౌన్‌, హుస్నాబాద్‌ గ్రామీణం - న్యూస్‌టుడే: రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేటలో విలేకరుల సమావేశంలోను, అక్కన్నపేటలో కరీంనగర్‌ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ ఎన్నికల ప్రచారసభలోను ఆయన శుక్రవారం మాట్లాడారు. ‘‘భారాస ఉంటే ఏ రోజైనా మళ్లీ ప్రజలు కేసీఆర్‌ వైపు వెళ్తారన్న భయంతోనే భాజపా, కాంగ్రెస్‌ ఒక్కటయ్యాయి. చెరో 8 లోక్‌సభ స్థానాలను పంచుకుని, మిగిలినచోట్ల డమ్మీ అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్‌కు ఇచ్చిన స్థానాల్లో భాజపా ప్రచారం చేయదు.. భాజపాకు ఇచ్చిన సీట్లలో కాంగ్రెస్‌ బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రపు ప్రచారం చేస్తోంది. ఆగస్టు 15 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటకు వస్తాననడాన్ని స్వాగతిస్తున్నా.. అయితే నేను చేసిన సవాల్‌ను వెంటనే స్వీకరించాలి. ఇప్పటికీ దాన్ని స్వీకరించకుండానే సీఎం ఏవేవో మాట్లాడుతున్నారు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు నెరవేర్చి, రైతు రుణమాఫీ చేస్తే నేనే సీఎం రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి సిద్దిపేటకు స్వాగతిస్తా. నా రాజీనామాను ఆమోదింపజేసుకుంటా. ఒకవేళ హామీలు అమలు చేయకుండా, రాజీనామా చేయకపోతే కొడంగల్‌ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా? సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి హుందాగా మాట్లాడితే బాగుంటుంది. ఆయన చేసిన అసందర్భ వ్యాఖ్యలతో రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయాయి. స్థిరాస్తి రంగం కుదేలయింది. కేసీఆర్‌  బస్సుయాత్ర సూపర్‌హిట్‌ కావడంతోనే కాంగ్రెస్‌, భాజపాలు ‘నువ్వు కొట్టినట్టు చెయ్యు.. నేను తిట్టినట్టు చేస్తా’ అన్నట్లు ఒక్కటయ్యాయి. సీఎం నోట ఎప్పుడూ నిజాలు రావు. సిద్దిపేటలో అభివృద్ధి జరగలేదన్న దానికంటే అబద్ధం మరొకటి లేదు. ఆయన సీఎం అయ్యారంటే అది సిద్దిపేట పుణ్యమే. తెలంగాణ ఏర్పడకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. సిద్దిపేటకు, కేసీఆర్‌కు ఆయన రుణపడి ఉండాలి. భాజపా మతాన్ని, కాంగ్రెస్‌ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ ఉందని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. ఆ డబ్బులను దిల్లీకి పంపుతున్నారన్నారు. అది నిజమైతే ఈడీ, ఐటీలు ఎందుకు రావడం లేదు? దీనివల్ల ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని అర్థమవుతోంది.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించే కుట్ర..

వచ్చే జూన్‌ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతాయి. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో గులాబీ జెండా ఉండాలి. కాంగ్రెస్‌, భాజపాలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి ఆలోచన లేదు. మా ప్రభుత్వ హయాంలో లంబాడాలకు ఎంతో మేలుచేశాం. చందూలాల్‌, సత్యవతి రాథోడ్‌లకు మంత్రి పదవులు ఇచ్చాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం లంబాడాల్లో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదు’’ అని హరీశ్‌రావు విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో కరీంనగర్‌ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌, భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img