icon icon icon
icon icon icon

లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాసలో చీలికలు

దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

Published : 04 May 2024 05:43 IST

మంత్రి కోమటిరెడ్డి
తన ఆస్తి ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తీన్మార్‌ మల్లన్న ప్రకటన

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం నల్గొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. అధికారం కోల్పోయిన కేసీఆర్‌ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఖమ్మం భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతారని కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస నాలుగు ముక్కలుగా చీలిపోనుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి జీవో నం.46పై సీఎంతో చర్చించి నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పటి వరకు తన, తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న సుమారు రూ.1.5 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఈ సందర్భంగా ప్రకటించారు. తనపై పోటీ చేసే అభ్యర్థులు కూడా వారి ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం కల్పిస్తే రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, నకిరేకల్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, నల్గొండ, ఖమ్మం డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్‌, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img