icon icon icon
icon icon icon

ఏ ప్రభుత్వం తప్పు చేసినా.. ఎర్రజెండాకు ఎదిరించే శక్తి

‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది.

Published : 04 May 2024 05:44 IST

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: ‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది. మా ప్రభుత్వంతో సీపీఐకి భాగస్వామ్యం ఉన్నప్పటికీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకోరని తెలుసు’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌కు మద్దతు తెలుపుతూ శుక్రవారం మహబూబాబాద్‌లో నిర్వహించిన ‘సీపీఐ ప్రజా పిలుపు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో యూపీఏ ప్రభుత్వం వామపక్షాల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. భాజపా దేశంలో కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు వామపక్షాల సహకారం సంపూర్ణంగా ఉండాలని మంత్రి కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ తదితరులున్నారు.

కాంగ్రెస్‌ గూటికి ఖమ్మం మేయర్‌

లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఖమ్మం నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ, సరిపూడి రమాదేవి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారాస, భాజపా కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మేయర్‌ నీరజ మాట్లాడుతూ.. నగర అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నగర అధ్యక్షుడు ఎండీ జావేద్‌, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img