icon icon icon
icon icon icon

33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రధాని కృషి

ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కొనియాడారు.

Updated : 04 May 2024 06:18 IST

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కొనియాడారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఓ వేడుక మందిరంలో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి సమ్మేళనానికి హాజరైన ఆయన మాట్లాడారు. ‘‘మోదీ దయతో త్వరలో మహిళల చేతికి అధికార పగ్గాలు వస్తాయి. నారీ శక్తి ఏంటో రాబోయే రోజుల్లో చూడటం తథ్యం. ప్రస్తుత కేంద్ర మంత్రి మండలిలో 8 మంది మహిళలు మంత్రులుగా ఉన్నారు. కేసీఆర్‌ పాలన అంటే గుర్తొచ్చేది మద్యం, అత్యాచారాలు, హత్యలు మాత్రమే. ఎన్నికలప్పుడే ఆయన బయటకు వస్తారు. అలాంటి పార్టీకి ఓటేస్తారా? అవినీతి, అరాచకాల్లో భారాస నేతలు గుడిని మింగితే, కాంగ్రెస్‌ నేతలు గుడిలో లింగాన్ని కూడా మింగే రకం. మోదీతో రాహుల్‌గాంధీకి పోలికా? టీ అమ్ముకునే స్థాయి నుంచి కష్టపడి ప్రధాని స్థాయి వరకు మోదీ ఎదిగారు. దేశ ప్రజలే తన కుటుంబమని రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. రాహుల్‌గాంధీ తాత, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల కోసం ఏనాడైనా పోరాటాలు చేశారా? కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చారా? అసలు ప్రధాని అభ్యర్థి లేని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రయోజనం ఉంటుందా? కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు నెలకు రూ.6000 పింఛను ఇస్తానని ఎందుకివ్వడం లేదు’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పలువురు నేతలు సంజయ్‌ని కలిశారు. దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉంటానని, మీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img