icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రారంభం

లోక్‌సభ ఎన్నికలకు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Published : 04 May 2024 06:08 IST

‘ఇంటి నుంచి ఓటు’ సైతం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో 2,45,586 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు నమోదు చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో.. ఉద్యోగులు తమ నియోజకవర్గాల అభ్యర్థులకు ఓటు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 8 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ప్రత్యేక కవర్లలో బ్యాలెట్‌ పత్రం

ఉద్యోగుల కోసం ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలు, ప్రత్యేక కవర్లు, ప్రత్యేక బ్యాలెట్‌ బాక్స్‌లను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఓటు వేసిన తరవాత ఉద్యోగులు బ్యాలెట్‌ పత్రాన్ని ప్రత్యేక కవరులో ఉంచి సీలు వేసి, బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాలి. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు సమయంలో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్స్‌లు తెరిచి ఆయా ఓట్లను లెక్కిస్తారు.

ఇంటి నుంచి ఓటు...: దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియ గురువారం కొన్ని నియోజకవర్గాల్లో ప్రారంభం కాగా, అధిక శాతం నియోజకవర్గాల్లో శుక్రవారం మొదలైంది. ఇంటి నుంచి ఓటు వేసేందుకు రాష్ట్రంలో 21,394 మంది మాత్రమే ఆసక్తి చూపారు. వారిలో 11,032 మంది దివ్యాంగులు కాగా, 10,362 మంది వయోవృద్ధులు ఉన్నారు. 6వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తికానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img