icon icon icon
icon icon icon

వాస్తవాలపై చర్చిద్దాం రండి

యూపీఏ పాలనలో, ఎన్డీయే హయాంలో తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధులపై అర్థవంతమైన చర్చకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు.

Updated : 05 May 2024 05:32 IST

గాడిద గుడ్డు అనడం అభ్యంతరకరం
సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: యూపీఏ పాలనలో, ఎన్డీయే హయాంలో తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధులపై అర్థవంతమైన చర్చకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి సీఎంకు శనివారం బహిరంగ లేఖ రాశారు. ప్రజాస్వామ్యంలో సరైన సమాచారం, వాస్తవాలను ప్రజల ముందు పెట్టి, తగిన నిర్ణయం తీసుకోవాలని కోరవచ్చన్నారు. తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపి వాళ్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరమని, దీన్ని భాజపా ఖండిస్తోందని అన్నారు. ఇది పూర్తిగా అబద్ధాలను వ్యాప్తి చేయడమేనని.. సీఎం పదవి స్థాయినే దిగజారుస్తోందని అన్నారు. ఆధారాలు, అంకెలు, డేటా సహకారంతో నిర్ధారిత వాస్తవాలతో ప్రజల ముందు చర్చిద్దామన్నారు. కొడంగల్‌, అమరవీరుల స్తూపం, కృష్ణా, గోదావరి ఒడ్డున ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్థలం, సమయం, తేదీ ముఖ్యమంత్రే నిర్ణయించాలన్నారు. చర్చకు సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులను ఇచ్చిందని, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కింద రూ.2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసిందన్నారు. యూపీఏ ప్రభుత్వం పదేళ్లలో ఇచ్చింది రూ.45 వేల కోట్లకు మించదని అన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాలకు వేల కోట్ల రూపాయలను ఎన్డీఏ ప్రభుత్వం వ్యయం చేసిందన్నారు. ఎయిమ్స్‌ సహా అనేక సంస్థలను ఏర్పాటు చేసిందని లేఖలో పేర్కొన్నారు.

మూడు పార్టీలు ఒక్కటే

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మూడు భాజపా ప్రత్యర్థి పార్టీలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌లు కలిసే ముందుకు సాగుతున్నాయని, మూడు పార్టీల డీఎన్‌ఏ ఒకటే అని అన్నారు. మనదేశంలో ఉన్నవారు అంతా భారతీయులే అని పేర్కొంటూ మతప్రాతిపదికన రిజర్వేషన్లను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎంఐఎం పాల్పడుతోందన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రధాని మోదీతో మాట్లాడి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కరోనా సమయంలో తక్కువ నష్టంతో బయటపడటానికి ఆయన దార్శనికతే కారణమన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు వల్ల మోదీని తమ సోదరుడిగా ముస్లిం మహిళలు భావిస్తున్నారని అన్నారు.

రెండుసార్లు మాత్రమే పూర్తి గడ్డం తీసేశా

ఇప్పటివరకు తాను రెండుసార్లు మాత్రమే పూర్తిగా గడ్డం తీసేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తల్లి మరణించినపుడు ఒకసారి, అమెరికా వెళ్లినపుడు మరోసారి మాత్రమే పూర్తిగా గడ్డం తొలగించినట్లు సరదాగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అప్పటి భాజపా యువనేత అనంతకుమార్‌, తాను కలసి వెళ్లిన అమెరికా పర్యటనకు సంబంధించిన పలు అంశాల్ని వివరించారు. ఆ రోజు వైట్‌హౌస్‌ ముందు ఫొటో దిగిన మోదీని అదే వైట్‌హౌస్‌ అతిథిగా ఆహ్వానిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img