icon icon icon
icon icon icon

శాసనసభా పక్ష నేత పదవి బీసీలకు ఎందుకివ్వలేదు?

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే బలహీనవర్గాల(బీసీ)కు చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభాపక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని.. దీనికి కారణమేమిటని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఓ లేఖలో ప్రశ్నించారు.

Published : 05 May 2024 05:33 IST

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే బలహీనవర్గాల(బీసీ)కు చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభాపక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని.. దీనికి కారణమేమిటని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఓ లేఖలో ప్రశ్నించారు. భాజపా నేతలకు ఆయన రాసిన లేఖను శనివారం మీడియాకు విడుదల చేశారు. ‘‘మీరు గత పదేళ్లలో దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఒక్క కార్యక్రమమైనా చేపట్టారా? తెలంగాణకు చెందిన 7 మండలాలు, సీలేరు ప్రాజెక్టులను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి అప్పగిస్తే కనీసం స్పందించారా? రాష్ట్రంలో మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. మేం తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించాం. ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడుతూ అమరవీరులను అవమానిస్తే పార్లమెంట్‌లో మీరెందుకు స్పందించలేదు. తెలంగాణలో కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. మీరు రాజకీయంగా గుజరాతీలకు అనుకూలంగా పనిచేయడం తప్ప.. రాష్ట్రంలో విభజన చట్టం హామీలైనా అమలుచేశారా..? రిజర్వేషన్లను తొలగించాలని కుట్ర చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ రిజర్వేషన్‌ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరపాలని నినదిస్తే, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిన మాట నిజం కాదా? రిజర్వేషన్లు పెంచినందుకు బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసింది మీపార్టీనే కదా.. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా సమానత్వం కోరుకునే వాళ్లంతా మావోయిస్టులు అంటున్నారంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమానత్వం కోరుకుంటే మావోయిస్టులు అవుతారా..? ప్రస్తుత ఎన్నికల్లో 400 స్థానాలు అడుగుతున్నారంటే 2/3 మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసి నియంతృత్వంగా కొనసాగించాలనే ఎజెండా భాజపాకు లేదని చెప్పగలరా..?’’ అని పొన్నం ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img