icon icon icon
icon icon icon

నేడు ఐదు బహిరంగ సభలు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరింది. అగ్రనేతల రాకతో మరింత పదునెక్కుతోంది. భాజపా, కాంగ్రెస్‌ జాతీయ నేతలు రాష్ట్రంలో వరుసగా సభల్లో పాల్గొననున్నారు.

Published : 05 May 2024 05:34 IST

3 చోట్ల అమిత్‌షా.. 2 చోట్ల రాహుల్‌
జగిత్యాలలో కేసీఆర్‌ బస్సు యాత్ర
తెలంగాణను చుట్టేస్తున్న అగ్రనేతలు
జోరుగా కాంగ్రెస్‌, భాజపా, భారాస ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరింది. అగ్రనేతల రాకతో మరింత పదునెక్కుతోంది. భాజపా, కాంగ్రెస్‌ జాతీయ నేతలు రాష్ట్రంలో వరుసగా సభల్లో పాల్గొననున్నారు. ఆదివారం భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పలు బహిరంగసభల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుండగా పోలింగ్‌కు గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌, భాజపా, భారాస ప్రచారాన్ని తార స్థాయికి తీసుకెళ్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజులు రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పర్యటనకు రానున్నారు. అమిత్‌షా, రాహుల్‌గాంధీ రెండు దఫాలుగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఎన్నికల పర్వాన్ని వేడెక్కిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. లోక్‌సభ సీట్లలోనూ అంతకుమించి ఫలితాలను రాబట్టాలని భావిస్తూ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులను రంగంలోకి దింపుతోంది. భాజపా రాష్ట్రంలో రెండంకెల స్థానాలు పొందాలని ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. భారాస అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని అదనంగా ఓట్లను సాధించి మెరుగైన సంఖ్యలో లోక్‌సభ స్థానాలను దక్కించుకునేలా కసరత్తు చేస్తోంది.
అమిత్‌షా ఆదివారం ఆదిలాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని కాగజ్‌నగర్‌తోపాటు నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మరోదఫా పర్యటన ఖరారు కావాల్సి ఉంది. రాహుల్‌గాంధీ ఆదిలాబాద్‌ పరిధిలోని నిర్మల్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలోకి వచ్చే అలంపూర్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లి చౌరస్తాలో నిర్వహించే బహిరంగసభకు హాజరవుతారు. 9న మరోసారి రాష్ట్రానికి వచ్చే రాహుల్‌గాంధీ కరీంనగర్‌; మల్కాజిగిరి పరిధిలోని సరూర్‌నగర్‌ సభల్లో పాల్గొంటారు.

8, 10 తేదీల్లో ప్రధాని సభలు

ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న కరీంనగర్‌ పరిధిలోని వేములవాడ, వరంగల్‌ పరిధిలోని మడికొండ బహిరంగసభల్లో పాల్గొంటారు. 10న మహబూబ్‌నగర్‌ స్థానంలోని నారాయణపేట బహిరంగసభకు హాజరవుతారు. ప్రచారంలో చివరి కార్యక్రమంగా అదే రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో బహిరంగసభలో ప్రసంగిస్తారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సోమవారం పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ భాజపా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు.
3 సభల్లో ప్రియాంక...: కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంక 10న ఎల్లారెడ్డి(జహీరాబాద్‌), షాద్‌నగర్‌, తాండూరు(చేవెళ్ల) బహిరంగ సభల్లో పాల్గొంటారు.

సిద్దిపేటలో ప్రచారం ముగించనున్న కేసీఆర్‌

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బస్సుయాత్రలో భాగంగా ఆదివారం జగిత్యాలలో రోడ్‌షోతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 10న మెదక్‌ లోక్‌సభ స్థానంలోని సిద్దిపేట బహిరంగసభతో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img