icon icon icon
icon icon icon

గులాబీకి.. సవాలే

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసకి.. వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలు సవాలుగా మారాయి.

Updated : 05 May 2024 07:13 IST

కాంగ్రెస్‌, భాజపాకు దీటుగా ఈ ఎన్నికల్లో  నిలబడేందుకు భారాస ప్రయత్నం
బస్సు యాత్రతో క్యాడర్‌లో జోష్‌ తెచ్చేందుకు అధినేత కేసీఆర్‌ కృషి
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు పొందిన లోక్‌సభ స్థానాల్లోనూ గట్టి పోటీ
ఈనాడు, హైదరాబాద్‌

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసకి.. వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలు సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా వైభవం కోల్పోకుండా చూడాలని ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు పొందిన లోక్‌సభ స్థానాలతోపాటు తక్కువ తేడాతో ఓడిపోయిన చోట తిరిగి ఆధిక్యం సాధిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కొందరు సిటింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పార్టీని వీడిన నేపథ్యంలో కేడర్‌ను సమాయత్తం చేసి గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిచేందుకు భారాస ప్రయత్నం చేస్తోంది. ఓటింగ్‌ శాతం పెంపుపై కూడా దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ ఇటీవల కాలంలో మళ్లీ కార్యక్రమాలు పెంచింది. కేసీఆర్‌ కరవు ప్రాంతాల పర్యటనలు, దీనికి కొనసాగింపుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చేపట్టిన బస్సు యాత్రతో శ్రేణుల్లో జోష్‌ వస్తున్నట్లు భావిస్తోంది. సాగు, విద్యుత్తు అంశాలపై దృష్టి కేంద్రీకరించి కేసీఆర్‌ మాట్లాడుతూ ఆయా ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ యంత్రాంగంలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు దీటుగా ఈ ఎన్నికల్లో నిలబడేందుకు భారాస ప్రయత్నిస్తోంది.

  •  సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని భారాస గెల్చుకోగా, ఒక చోట ఎంఐఎం గెలిచింది. భారాసకి 4.63 లక్షల ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2.8 లక్షలు, భాజపాకు 2.16 లక్షలు వచ్చాయి. ఖైరతాబాద్‌ నుంచి భారాస తరఫున గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. భాజపా నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. భారాస సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను రంగంలోకి దించింది. జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ త్రిముఖ పోటీ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో లక్షా 80వేల ఆధిక్యాన్ని సాధించిన భారాసకి ఇప్పుడు భాజపా, కాంగ్రెస్‌లు సవాలుగా నిలిచాయి.
  • చేవేళ్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు భారాస, మూడు కాంగ్రెస్‌ గెల్చుకొన్నాయి. భారాసకి ఏడు లక్షల ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు ఆరు లక్షలు, భాజపాకు 3.35 లక్షలు వచ్చాయి. భారాస సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. భాజపా నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భారాస నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ రంగంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌, భాజపాల మధ్య పోటాపోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకి స్వల్ప ఆధిక్యం లభించింది. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో భాజపా కంటే భారాసకు 17వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిర్పూర్‌, ముథోల్‌, నిర్మల్‌లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మూడో స్థానంలో నిలిచిన ఆ పార్టీ ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అభ్యర్థి ఎంపిక, మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టితో పోటీ భాజపా, కాంగ్రెస్‌ల మధ్య అన్నట్లుగా మారింది. భారాస కూడా పట్టు సడలకుండా చూసుకొనే ప్రయత్నాల్లో ఉంది.
  • కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో భారాసకి కాంగ్రెస్‌ కంటే ఐదువేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. మాజీ ఎంపీ, పార్టీ సీనియర్‌ నాయకుడు వినోద్‌కుమార్‌ బరిలో ఉన్నారు. ఇటీవల భారాస, కాంగ్రెస్‌ల కంటే రెండున్నర లక్షల ఓట్లు తక్కువ పొందిన భాజపా ఇప్పుడు ప్రధాన పోటీదారుగా మారింది. సిటింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ తిరిగి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి వెలిచాల రాజేందర్‌రావు రంగంలో ఉన్నారు. ఉద్యమగడ్డ కరీంనగర్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరేసేందుకు భారాస తీవ్రంగా ప్రయత్నిస్తున్నా త్రిముఖ పోటీలో ఏ మేరకు సఫలీకృతం అవుతుందో చూడాల్సి ఉంది. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌ కూడా ఈ ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది.
  • నిజామాబాద్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి కాంగ్రెస్‌ కంటే కేవలం ఐదువేల ఓట్లు మాత్రమే భారాసకి ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ భాజపాకు కూడా భారాస, కాంగ్రెస్‌లతో పోటాపోటీగా ఓట్లు లభించాయి. త్రిముఖ పోటీ ఏర్పడిన ఈ నియోజకవర్గంలో భారాసకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌, భాజపాలకు ఇద్దరేసి ఉన్నారు. అయితే ద్వితీయశ్రేణి నాయకులు పలు చోట్ల పార్టీని వీడిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యాన్ని నిలుపుకోవడం భారాసకి సవాలుతో కూడుకున్నదే. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చిన ఇతర ఎంపీ నియోజకవర్గాల్లో నాలుగైదు చోట్ల గట్టి పోటీ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల భాజపా కూడా దూకుడుగా ముందుకు రావడంతో ఈ ప్రభావం భారాసపై ఏ మేరకు చూపుతుందో చూడాల్సి ఉంది.

  • శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను భారాస గెల్చుకోవడమే కాకుండా అన్ని చోట్లా భారీ ఆధిక్యాలు సాధించింది. మొత్తం 9.38 లక్షల ఓట్లు పొందింది. ఇక్కడ కాంగ్రెస్‌ 5.83 లక్షలతో రెండో స్థానం, 4.25 లక్షల ఓట్లతో భాజపా మూడో స్థానంలో నిలిచాయి. ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా భారాస తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి హస్తం పార్టీ తరఫున, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భాజపా పక్షాన బరిలో నిలిచారు. అందరికంటే ముందుగానే ఈటల ప్రచారం ప్రారంభించారు. మల్కాజిగిరి ఎంపీ స్థానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో గెలిచినది కావడంతో కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. భారాస తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నా, భాజపా, కాంగ్రెస్‌లు గట్టి పోటీదారుగా ఉన్నాయి. ఈ రెండూ రోజురోజుకు దూకుడు పెంచుతున్నాయి. నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మూడున్నర లక్షల ఓట్లు ఎక్కువగా సాధించిన ఈ లోక్‌సభ స్థానం భారాసకి ప్రతిష్ఠాత్మకంగా మారింది.

  • మెదక్‌ సీటును కచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం భారాసలో ఉన్నా, ప్రస్తుతం అక్కడ త్రిముఖ పోటీ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌, భాజపాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలో భారాసకి 6.68 లక్షల ఓట్లు, కాంగ్రెస్‌కు 4.2 లక్షలు, భాజపాకు 2.2 లక్షలు వచ్చాయి. భారాసకి అత్యధిక మెజార్టీ వచ్చిన.. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ కూడా ఈ స్థానం పరిధిలోనే ఉన్నాయి. భారాస మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని ఇక్కడ పోటీకి దింపింది. హరీశ్‌రావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. అయితే నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ద్వితీయ శ్రేణి నాయకులు అనేక మంది కాంగ్రెస్‌, భాజపాలలో చేరారు. ఈ రెండూ ఇక్కడ ఎలాగైనా నెగ్గాలని హోరాహోరీ పోరాడుతుండటంతో ఈ ఎన్నిక భారాసకి సవాలుగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో భారాస తప్పక గెలిచే స్థానాల్లో ఇదొకటని భావించినా, పోలింగ్‌ సమీపించేకొద్దీ ముక్కోణపు పోటీ వాతావరణం ఏర్పడింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img