icon icon icon
icon icon icon

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్నారు

‘‘దేశ ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితోనే భాజపా నేతలు 400 లోక్‌సభ స్థానాలు గెలిపించాలంటున్నారు.

Published : 05 May 2024 05:39 IST

రిజర్వేషన్లపై మోదీ, అమిత్‌షా అబద్ధాలు
ప్రజ్వల్‌ రేవణ్ణను గెలిపించాలంటూ మోదీ ప్రచారం చేస్తారా?
మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘దేశ ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితోనే భాజపా నేతలు 400 లోక్‌సభ స్థానాలు గెలిపించాలంటున్నారు. రిజర్వేషన్లపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు అబద్ధాలు చెబుతున్నారు’’ అని మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆయన పాతబస్తీలో పాదయాత్రల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చార్మినార్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన శనివారం ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘‘దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కులాలపరంగా చీలిక తెచ్చేందుకు మోదీ, అమిత్‌షాలు కుట్రలు పన్నుతున్నారు. ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఎన్నికల సభల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్నారు. అక్కడి ముస్లింలను ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లిచేసుకోమంటున్నారు.. అలా ఆదేశించే అధికారం ప్రభుత్వానికి లేదు.

భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం..

రాజ్యాంగాన్ని మార్చితే మన హక్కులు, సౌకర్యాలు కోల్పోతామని అంబేడ్కర్‌ భావజాల ప్రియులు బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే భావజాలం ఉండాలన్నది వారి విధానం. భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం. భిన్న సంస్కృతులు, ఆచారాలు ఇదే మనకున్న బలం. ప్రజలకు వారికి నచ్చిన మతాన్ని ఎంచుకొనే హక్కు ఉంది. ఫలానా మతంలోనే ఉండాలని, ఆచారాలు పాటించాలని ప్రభుత్వాలు ఎలా చెబుతాయి. అందుకే భాజపా విధానాలను మేం వ్యతిరేకిస్తున్నాం.

సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ అంతా బూటకం

భాజపా ఇటీవల ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన నినాదం సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ అంతా బూటకం. ఆ నాయకుల మనసుల్లో ‘హిందుత్వం’ ఇప్పటికీ సజీవంగా ఉంది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే సమాజంలో వారు ఉన్నతంగా ఎదిగే అవకాశాలున్నాయని గ్రహించారు. రిజర్వేషన్లు లేని మైనార్టీలు నిరుద్యోగులుగానే ఉండాలన్న లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారు. భాజపా నాయకులు ఓట్ల కోసం నేర చరితులను, రేపిస్టులను దగ్గరికి తీసుకుంటున్నారు. కర్ణాటకలో వందల మంది మహిళలపై అత్యాచారాలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణ గెలుపు కోసం ప్రధాని మోదీ ప్రచారం చేశారు. అతను చెడ్డవాడని తెలిసినా ఎందుకు మద్దతు ఇచ్చారు. ఇదొక్కటేకాదు.. ఉన్నావ్‌, హత్రాస్‌ సంఘటనల్లోనూ భాజపా నాయకుల పాత్ర తేటతెల్లమైంది’’ అని అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img