icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ వ్యతిరేక మార్పు మొదలైంది

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో.. పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మార్పు మొదలైందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Updated : 05 May 2024 07:09 IST

ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదు 
రాష్ట్రానికి ఒక్క మేలూ చేయని భాజపాకు ఎందుకు ఓటేయాలి?
ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం వస్తోంది
అత్యధిక ఎంపీ సీట్లలో భారాసదే గెలుపు
‘మీట్‌ ది మీడియా’లో హరీశ్‌రావు ధీమా

ఈనాడు-హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో.. పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మార్పు మొదలైందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. పంట చేతికొచ్చినా పెట్టుబడి సాయం అందని మార్పు మొదలైంది. కేసీఆర్‌ కిట్‌ నిలిచిపోయి.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే మార్పు మొదలైంది. రివర్స్‌గేర్‌లో పోతున్న కాంగ్రెస్‌ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, కాంగ్రెస్‌, భాజపాల కంటే భారాసనే అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకోబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.

గ్యారంటీల అమలు పచ్చి అబద్ధం

‘‘ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది. మొదటి గ్యారంటీ.. మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలు చేశారా? రెండోది.. రైతుబంధు రూ.15వేలు, రూ.2 లక్షల  రుణమాఫీ, వడ్లు, మొక్కజొన్నలకు క్వింటాకు రూ.500 బోనస్‌, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇచ్చారా? మూడో గ్యారంటీ.. ఇందిరమ్మ ఇళ్లు కింద రూ.5 లక్షలు, 250 గజాల స్థలం..ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇచ్చారా? నాలుగోది.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు? ఐదో గ్యారంటీ.. చేయూత కింద పింఛన్లను రూ.4వేలకు పెంచుతామన్నారు.. పెంచారా? గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటును 91 లక్షల మంది లబ్ధిదారులకుగాను.. 30 లక్షల మందికే అమలు చేస్తున్నారు. హామీలను అమలు చేస్తామని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మాటనిలుపుకోని ఆపార్టీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.

రాష్ట్రం పరువు తీసేలా రేవంత్‌ భాష

ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ను ఉద్దేశించి.. పేగులు తీసి మెడలో వేసుకుంటా.. గుడ్లు తీసి గోళీలాడుకుంటా.. అని అసభ్యకర భాషను రేవంత్‌ ఉపయోగించడాన్ని ప్రజలు ఆమోదించడం లేదు. ప్రజాపాలనలో ప్రజలకు అందుబాటులో ఉంటానన్న ముఖ్యమంత్రి.. కేవలం ఒక్క మొదటిరోజు మాత్రమే కనిపించి మాయమయ్యారు. పార్టీ మారితే వెంటనే సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పెట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే.. భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ చెబుతున్న దానికి.. రేవంత్‌ చేస్తున్నదానికీ పొంతన లేదు.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కుట్ర

తెలంగాణలోని 7 మండలాలను, సీలేరు ప్రాజెక్టును కేంద్రం ఏపీలో కలిపింది. వీటిపై భాజపా ప్రభుత్వం పెట్టిన బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. దీన్ని వ్యతిరేకించిన పార్టీ భారాసనే. రేవంత్‌ భాజపాలో చేరుతారని ఆ పార్టీ నేతలే చెబుతుంటే.. వారి మాటలను ఆయన ఎందుకు ఖండించడం లేదు? 8 సీట్లలో భాజపా గెలుపునకు రేవంత్‌ సహకరిస్తున్నారు. వచ్చే జూన్‌ 2తో పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోతోంది. ఇప్పుడు మరికొన్నాళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కుట్ర చేస్తున్నారు. పార్లమెంటులో భారాస ఎంపీలుంటేనే ఉమ్మడి రాజధాని కుట్రను అడ్డుకోగలరు. రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్‌, భాజపా ఆడుతున్న నాటకం. గత పదేళ్ల పాలనలో భాజపా రాష్ట్రానికి ఒక్క మేలూ చేయలేదు. అలాంటివారికి ఎందుకు ఓటేయాలి? అసెంబ్లీ ఎన్నికలప్పుడు కవితను అరెస్టు చేయలేదు గనుక.. భాజపా, భారాస ఒక్కటేనని ప్రచారం చేసి మైనారిటీల ఓట్లు కాంగ్రెస్‌ సంపాదించుకుంది. ఇప్పుడు కవిత అరెస్టు అయ్యారు. కుమ్మక్కైతే ఎందుకు అరెస్టు చేస్తారు? కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయి. కేసీఆర్‌ ప్రధానమంత్రి అవుతారో లేదో ఇప్పుడే చెప్పలేం’’ అని హరీశ్‌రావు వెల్లడించారు.


తీరికలేని ప్రచారం.. కాలిబాటపైనే అల్పాహారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారాస నేత, మాజీమంత్రి హరీశ్‌రావు తీరిక లేకుండా పాల్గొంటున్నారు. మెదక్‌, జహీరాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో ఆయా అభ్యర్థుల తరఫున కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి దుబ్బాక నియోజకవర్గం అక్బర్‌పేట-భూంపల్లిలో ప్రచారానికి వెళ్తూ, సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్‌బోర్డు చౌరస్తాలో కాలిబాటపై ఫుడ్‌కోర్టు వద్ద అల్పాహారం చేశారు. ఆయన వెంట మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. అనంతరం కొందరు హరీశ్‌రావుతో స్వీయచిత్రాలు దిగారు.

 న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img