icon icon icon
icon icon icon

మాదిగలకు సీటివ్వని కాంగ్రెస్‌ను ఓడించాలి

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మాదిగలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

Published : 05 May 2024 05:42 IST

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

రాంనగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మాదిగలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఆయనతోపాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌, బీసీ రాజ్యాధికార సమితి జాతీయ అధ్యక్షుడు దాసు సురేశ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేపట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మూడు రిజర్వుడ్‌ నియోజకవర్గాలుంటే వాటిల్లో ఒక్కటీ కేటాయించకపోవడంతో పాటు ఉపఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్‌లోనూ మాదిగలకు అవకాశమివ్వకపోవడం తగదన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకూ అన్యాయం జరిగిందని, ఓడిపోయే సీట్లు రెండింటిని వారికి ఇచ్చారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మాదిగలు, బీసీలూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయాలన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని భాజపాపై కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతవుతుందని అన్నారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, మాదిగలను అవమానించిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఓడించాలని.. ఆ పార్టీకి ఓటు వేస్తే తనను చంపినట్లేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఎస్సీ వర్గీకరణ చేపడతామని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించినందున.. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌ మాదిగ, నేతలు సోమశేఖర్‌, సత్యం, సూరన్న, గోపాల్‌, లక్ష్మణ్‌, సతీష్‌, కార్తిక్‌, శ్రీనివాస్‌, లత, నర్సయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img