icon icon icon
icon icon icon

అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

Updated : 05 May 2024 07:06 IST

ఏ 16 జిల్లాలను తొలగిస్తారో రేవంత్‌రెడ్డి చెప్పాలి
మోదీకి ఓటేస్తే సిలిండరు ధర రూ.5 వేలకు పెంచుతారు
సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ విమర్శలు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ తరఫున శనివారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రచారం చేశారు. తొలుత పట్టణంలో కాలినడకన పలు వార్డుల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. బీవైనగర్‌, వెంకంపేట కూడళ్లలో, వీర్నపల్లి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో, మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే ఇద్దరం జోడెద్దుల మాదిరిగా పోరాటం చేసైనా సిరిసిల్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. వేరేవారు వస్తే నేను ఇటుగుంజ, ఆయన అటుగుంజ.. సరిపోతుంది’’ అని అభిప్రాయపడ్డారు.

హామీలు అమలయ్యాయా?

‘‘కరెంటు కోతలు మొదలయ్యాయి. మరమగ్గాలు నడవడం లేదు. తాగునీటికి గోస తప్పడం లేదు. కాంగ్రెస్‌ తీసుకొస్తానన్న మార్పు ఇదేనా? సిరిసిల్లకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయిదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. ఇక్కడ ఎవరికన్నా పెళ్లి జరిగిన వారికి తులం బంగారం వచ్చిందా? వృద్ధుల పింఛను రూ.4 వేలు చేశారా? రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందా? క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చారా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘పార్లమెంటు స్థానానికి ఒక జిల్లా ఉండాలని కాంగ్రెస్‌ వారు చెబుతున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఏ 16 జిల్లాలను తొలగిస్తారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

‘‘2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 ఉంటే, ప్రస్తుతం రూ.1200కు చేరింది. ఈసారి మోదీకి ఓటేస్తే సిలిండరు ధర రూ.5 వేలకు చేరుతుంది. పెంచిన ధరలతో సామాన్య ప్రజల నుంచి నరేంద్రమోదీ రూ.30 లక్షల కోట్లు దోచుకున్నారు. ఆ మొత్తం నుంచి అదానీ, అంబానీలకు రూ.14.50 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. నేను చెప్పేది అబద్ధమని భాజపా నాయకులు నిరూపిస్తే రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మసీదులు తవ్వాలని మాట్లాడుతున్నారు. తవ్వాల్సింది అభివృద్ధి పనులకు పునాదులు. అయిదేళ్ల క్రితం ఆయనను ఎంపీగా గెలిపిస్తే సిరిసిల్లకు రూపాయి పని చేయలేదు. భాజపా నాయకులు దేవుణ్ని అడ్డం పెట్టుకుని ఓట్ల రాజకీయం చేస్తున్నారు’’ అని కేటీఆర్‌ విమర్శించారు.

సమస్యలపై మహిళ ఆవేదన

సిరిసిల్ల రైతుబజారులో కూరగాయల విక్రయదారులతో కేటీఆర్‌ మాట్లాడుతుండగా.. ‘వైద్య కళాశాల కోసం తీసుకున్న భూములు తిరిగి అప్పగించాలని, రెండు పడక గదులు ఇల్లు ఇంకెప్పుడు ఇస్తారు’’ అని అక్కడ పెద్దూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టర్‌తో మాట్లాడి భూమి తిరిగి ఇప్పించడంతోపాటు రెండు పడక గదుల ఇల్లు వచ్చేలా చూస్తానని ఆ మహిళను కేటీఆర్‌ సముదాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img