icon icon icon
icon icon icon

ఎవరికో ‘వరం’గల్‌..!

సాంస్కృతిక రాజధాని.. పర్యాటక కేంద్రాల నిలయం.. కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లులో లోక్‌సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది.

Updated : 05 May 2024 07:12 IST

గ్యారంటీ హామీల అమలుతో సానుకూలమని కాంగ్రెస్‌ ధీమా
ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసొస్తుందంటున్న భారాస
మోదీ కరిష్మాపై భాజపా నమ్మకం
ఓరుగల్లులో త్రిముఖ పోరు
వరంగల్‌ నియోజకవర్గ ముఖచిత్రం
వరంగల్‌ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

సాంస్కృతిక రాజధాని.. పర్యాటక కేంద్రాల నిలయం.. కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లులో లోక్‌సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. ఎస్సీలకు రిజర్వ్‌ అయిన ఈ స్థానంలో మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధానంగా కాంగ్రెస్‌, భారాస, భాజపాల మధ్యే గట్టి పోటీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌, భారాసల మధ్య.. నగర, పట్టణ ప్రాంతాల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య ఎక్కువ పోటీ ఉంది. ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగిన ముగ్గురు అభ్యర్థులూ లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీచేస్తున్నారు. వీరిలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ గతంలో రెండుసార్లు వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ఇంతవరకూ అసెంబ్లీ లేదా పార్లమెంటుకు పోటీచేయలేదు. ఈ లోక్‌సభ పరిధిలో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1.58 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యం రావడంతో పాటు, గ్యారంటీ హామీల అమలుతో పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ఆధిక్యంతో గెలుస్తామని కాంగ్రెస్‌ భావిస్తోంది. తమకు గట్టి పట్టు ఉన్న ప్రాంతం అని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన బాగా లేదని ప్రజలు భావిస్తున్నందున, కేసీఆర్‌పై అభిమానంతో తమనే మళ్లీ ఆదరిస్తారని భారాస నేతల అంచనా. మోదీపై ఉన్న అభిమానంతోపాటు వరంగల్‌ నగరంలో సుదీర్ఘకాలంగా తమకున్న ఆదరణతో గట్టెక్కుతామని భాజపా భరోసాతో ఉంది.

గెలిపిస్తే.. చేస్తారని..

‘రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశాను. రేవంత్‌రెడ్డి సీఎం అయి ఆరునెలలైనా కాలేదు కదా. ఇప్పుడే ఆయన పార్టీని ఓడిస్తే ఎట్లా? ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తారని మా తండా వాసులం అనుకుంటున్నాం’’ అని పాలకుర్తి మండలానికి చెందిన గిరిజన రైతు టీక్యా ‘ఈనాడు’కు చెప్పారు. ‘మొన్నటి ఎన్నికల్లో భారాసకు ఓటేశాను. ఇప్పుడు జరిగేవి పార్లమెంటు ఎన్నికలు కదా.. ఎవరికి వేయాలా అని ఆలోచిస్తున్నా’ అని వర్ధన్నపేటకు చెందిన చిరు వ్యాపారి రాజేశ్‌ చెప్పారు. ‘భాజపా గెలిస్తే మోదీ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆ పార్టీకే ఓటు వేయాలని అనుకుంటున్నా’ అని వరంగల్‌ స్టేషన్‌రోడ్‌ ప్రాంతంలో నివసిస్తున్న గోపాల్‌ చెప్పారు.


ప్రధాన సమస్యలు..

  • కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని, కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.
  • ఈ నియోజకవర్గంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని నిరుద్యోగులు వాపోతున్నారు. వరంగల్‌, హైదరాబాద్‌ నగరాల మధ్య పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుచేస్తే లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు చెబుతున్నారు.
  • విమానాశ్రయం అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ ఉన్నా.. దశాబ్దాలుగా పార్టీలు హామీ ఇస్తున్నా.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
  • వరంగల్‌లోని టెక్స్‌టైల్‌ పార్క్‌ను ‘ప్రధానమంత్రి మిత్ర’ పథకం కింద చేర్చినా ఇంతవరకూ కేంద్రం నిధులు విడుదల చేయలేదు.  
  • ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు గేట్‌వే మాదిరిగా ప్రధాన జంక్షన్లుగా కాజీపేట, వరంగల్‌ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. వీటిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. సికింద్రాబాద్‌ నుంచి కాజీపేటకు కేవలం రెండుగంటల్లోపే వెళ్లే వందే మెట్రో లోకల్‌ రైళ్లను ప్రవేశపెడితే రాష్ట్ర రాజధానికి అనుసంధానం మరింత పెరుగుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

అసెంబ్లీ ఓట్ల ఆధిక్యంతో కావ్యకు ధీమా..

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ పోరులోనూ పునరావృతమవుతాయని కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడియం కావ్య ధీమాగా ఉన్నారు. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... ఆరుచోట్ల నెగ్గిన కాంగ్రెస్‌కు ఆరు స్థానాల్లో కలిపి మొత్తం 1,58,688 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఆరు స్థానాల్లో భారాస, వరంగల్‌ తూర్పులో భాజపా రెండో స్థానంలో నిలిచాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో భారాస 7,779 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌పై నెగ్గింది. ఇప్పుడు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరడంతో పాటు ఆయన కుమార్తె కావ్యనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తుండటం సానుకూల అంశంగా పార్టీ భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు తగ్గకుండా ఓట్లు రాబట్టేందుకు ఒక్కో సెగ్మెంట్‌ వారీగా జాగ్రత్తలు తీసుకుని ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. మెజార్టీ తగ్గితే తమ నియోజకవర్గంలో వ్యతిరేకత మొదలైందనే ప్రచారం జరుగుతుందని ఎమ్మెల్యేలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కూడా ఇదే లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నందున ఆమెకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ప్రజాపాలన, గ్యారంటీ హామీల అమలుతో ప్రజలకు చేరువైన తీరు కలసి వస్తుందని పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.


కేసీఆర్‌పై ఉన్న అభిమానం గెలిపిస్తుందన్న నమ్మకం

భారాస అభ్యర్థి డాక్టర్‌ మారపెల్లి సుధీర్‌కుమార్‌ తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ ఇదే పార్టీలో ఉన్నారు. ఆయుర్వేద డాక్టర్‌ అయిన ఆయనకు వివాదరహితుడనే పేరుంది. ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రచారంలో పార్టీ నేతలందరూ ఆయనకు సహకరిస్తున్నారు. అయితే, భారాస నుంచి కాంగ్రెస్‌కు నేతల వలస సమస్యగా మారిందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇటీవల భారాస అధినేత కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనకు వచ్చినా.. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య హాజరుకాలేదు.

వరంగల్‌ ప్రస్తుత మేయర్‌, భారాస నాయకురాలు సుధారాణి, పలువురు కార్పొరేటర్లు వర్ధన్నపేట సెగ్మెంట్‌కు చెందిన డీసీసీబీ ఛైర్మన్‌ ఎం.రవీందర్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. భారాస ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్‌ కూడా హస్తం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్యను ఇటీవలే మళ్లీ భారాసలో చేర్చుకుని కడియం శ్రీహరిపై విమర్శలు చేయడానికి ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా పక్కనే ఉన్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాతా ఉమ్మడి వరంగల్‌ జిల్లావాసులు తమతోనే ఉన్నారని, ఇప్పటికీ కేసీఆర్‌పై వారికున్న అభిమానం గెలిపిస్తుందని భారాస వర్గాలు భావిస్తున్నాయి.


అసెంబ్లీ నుంచి లోక్‌సభకు అరూరి యత్నం

భారాస తరఫున గతంలో రెండుసార్లు 2014, 18లలో వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన అరూరి రమేశ్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.  తర్వాత భాజపాలో చేరి వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2014-23 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా వర్ధన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయనపై స్థానికుల్లో వ్యతిరేకత ఉన్నందునే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయారని ఓటర్ల అంచనా. ఇప్పుడు వరంగల్‌ లోక్‌సభ పరిధిలోనే ఉన్న వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనపై ప్రజల్లో ఎంత సానుకూలత వస్తుందనేది కీలకంగా మారింది.

వరంగల్‌ నగరంలోని తూర్పు, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నగర ఓటర్లు భాజపా, మోదీ వైపు మొగ్గుచూపుతారని ఆశలు పెట్టుకున్నారు. కానీ, భాజపా గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు సెగ్మెంట్లలో పరకాల, వరంగల్‌ తూర్పులో తప్ప మిగతాచోట్ల పెద్దగా ఓట్లు సాధించలేకపోవడం గమనార్హం. ఇవి పార్లమెంటు ఎన్నికలని, కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే విమానాశ్రయం, టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధితో పాటు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు వందే మెట్రో రైళ్లు కూడా వచ్చేలా చూస్తామని భాజపా నేతలు చెబుతున్నారు. మోదీపై  ప్రజల్లో ఉండే అభిమానం కలసి వస్తుందని భాజపా వర్గాలు భావిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img