icon icon icon
icon icon icon

కాంగ్రెసోళ్లు ఏమీ చేయరు

‘పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి... భూగర్భ కార్మికుడికి మధ్య. కార్మికుడు గెలవాలా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా? ఆలోచించండి.

Published : 05 May 2024 05:54 IST

అడ్డగోలు హామీలు తప్ప అమల్లేదు
రైతులకు రుణ మాఫీపై సీఎం రేవంత్‌ దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారు
ఉచిత బస్సు ప్రయాణ పథకంతో సిగలు పట్టుకొని కొట్లాడుతున్న మహిళలు
మాజీ సీఎం కేసీఆర్‌

ఈటీవీ- ఆదిలాబాద్‌, మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: ‘పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి... భూగర్భ కార్మికుడికి మధ్య. కార్మికుడు గెలవాలా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా? ఆలోచించండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. భాజపాతో మనకేం ఒరగలేదు. ఒక్క భారాసయే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ తరఫున ఆయన శనివారం రాత్రి మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఏర్పాటుచేసిన రోడ్‌షోలో మాట్లాడారు. ‘‘నోటికి ఏదొస్తే అది అన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. రైతులకు రుణ మాఫీపై ఏ ఊరికివెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. మొదట డిసెంబరు 9 అన్నారు అది పోయింది.. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. కాంగ్రెసోళ్ల మాట నమ్మేటట్లు ఉందా? ఏమీ చేయరని తేలింది’ అని అన్నారు. ‘‘రైతుబంధు ఇవ్వడం లేదు. సీఎం సహాయ నిధి కింద సాయాన్ని నిలిపివేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, తులం బంగారం ఏమయ్యాయి? భారాస ప్రభుత్వంలో దళితబంధు పథకం తెచ్చాం. 1.30 లక్షల మందికి మంజూరు చేశాం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులను వాపసు తీసుకుంది. దళితులు అర్హులు కారా? వారికోసం కేటాయించిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? గిరిజనులకు నాలుగున్నర లక్షల ఎకరాల పోడుభూములు ఇచ్చాం. వారికీ భారాస ప్రభుత్వం రైతు బంధు, బీమా ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు లేవు. వీధిదీపాలు పోతే మరమ్మతులు లేవు. కేసీఆర్‌ కిట్‌లు లేవు. కొత్త వైద్యకళాశాలలకు అనుమతులు లేవు. ధాన్యాన్ని కొనరు. వరికి బోనస్‌.. బోగస్సే. సీఎం రేవంత్‌ ఎవరినీ గౌరవించరు. ఐదునెలల్లో పథకాలన్నింటినీ ఆపేశారు. చెన్నూరు ఎత్తిపోతల పథకం, మంచిర్యాల మార్కెట్‌ సమీకృత భవన సముదాయాన్ని నిలిపివేశారు. ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే భారాస బలమే మన బలం అని గుర్తించాలి. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. అందులో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పనికిమాలిన పథకం. దానివల్ల మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోరిక్షా కార్మికుల బతుకులు ఆగమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అని కేసీఆర్‌ అన్నారు.

మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవాలా?

‘‘ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం నాడు భారాస ప్రభుత్వం విభజించింది. కొత్తగా మంచిర్యాల, నిర్మల్‌, కుమురంభీం జిల్లాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలైన మరుసటి రోజు నుంచే జిల్లాలను రద్దు చేస్తానని రేవంత్‌రెడ్డి అంటున్నారు. మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవాలా? మంచిర్యాల జిల్లా ఉండాలంటే భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ని గెలిపించండి. మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనేవాళ్లు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి పుణ్యం కట్టుకోండి.

నరేంద్ర మోదీది గ్యాస్‌ కంపెనీ.. అన్నీ ఉత్తి మాటలే

పదేళ్ల కిందట గెలిచినప్పుడు మోదీ జన్‌ధన్‌ఖాతాలలో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్నారు.. వచ్చాయా? బేటీ బచావో.. బేటీ పఢావో అన్నారు.. ఏం జరిగింది? నరేంద్ర మోదీది గ్యాస్‌ కంపెనీ... అన్నీ ఉత్తి మాటలే. అందుకే భాజపాకు ఓటేసినా గోదావరిలో పడేసినా ఒకటే. అందుకని అత్యధిక మెజార్టీతో కొప్పుల ఈశ్వర్‌ని గెలిపించండి.

జైళ్లకు భయపడను..

తెలంగాణ హక్కులు కాపాడటం కోసం పోరాడతా. నేనున్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను. నా ప్రాణాలను బలిపెట్టి అయినా కాపాడుకుంటా. జైళ్లకు భయపడను’’ అని కేసీఆర్‌ అన్నారు.

అడుగడుగునా ఘనస్వాగతం

గోదావరిఖని నుంచి బస్సులో ఇందారం, శ్రీరాంపూర్‌ మీదుగా మంచిర్యాలకు చేరుకున్న కేసీఆర్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. మంచిర్యాల ఐబీ చౌరస్తాకు భారీగా జనం తరలి వచ్చారు. కాగితపు పూలు, టపాసుల పేలుళ్లు, డప్పుల దరువులు, కళాకారుల ఆటపాటల మధ్య కోలాహలం నెలకొంది. సాయంత్రం ఆరుగంటల నుంచి రోడ్‌షో ముగిసేవరకు జనం వేచి ఉన్నారు. రోడ్‌షోలో పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


సింగరేణి ప్రైవేటుపరమైతే బతుకులు ఆగమే..

ముఖ్యమంత్రి రేవంత్‌ దావోస్‌, ఆస్ట్రేలియా వెళ్లి సింగరేణిపై ఒప్పందం చేసుకున్నారు. నరేంద్రమోదీ నా మెడపై కత్తి పెట్టి ఆస్ట్రేలియా బొగ్గు కొనాలని, అదానీ బొగ్గు కొనాలని ఒత్తిడి చేస్తే నేను కొనలేదు. ఈ ముఖ్యమంత్రి అదానీని ఆహ్వానించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నారు. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి ప్రైవేటుపరమైతే మన బతుకులు ఏవిధంగా ఆగమవుతాయో ఆలోచించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img