icon icon icon
icon icon icon

9లోగా సంపూర్ణంగా రైతు భరోసా

‘‘రైతుభరోసా నిధులు జమ చేయలేదని కేసీఆర్‌, హరీశ్‌రావులు అంటున్నారు. డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టాం.

Published : 05 May 2024 06:14 IST

ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా
రూ.7,500 కోట్లు జమ చేస్తే కేసీఆర్‌ క్షమాపణ చెబుతారా?
భాజపాకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి, రిజర్వేషన్లకు చేటు
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూర్చను
కొత్తగూడెం జనజాతర సభ, కొత్తకోట, సీతాఫల్‌మండి, ముషీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈటీవీ-ఖమ్మం, ఈనాడు-మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, రాంనగర్‌-న్యూస్‌టుడే: ‘‘రైతుభరోసా నిధులు జమ చేయలేదని కేసీఆర్‌, హరీశ్‌రావులు అంటున్నారు. డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టాం. 69 లక్షల మంది రైతులకు గాను ఇప్పటివరకు 65 లక్షల మందికి అందించాం. మిగిలిన 4 లక్షల మంది ఖాతాల్లోకి మే 9వ తేదీలోపు సొమ్ము జమ చేస్తాం. ఖమ్మం నుంచి అలంపూర్‌ వరకు ఏ ఒక్క రైతుకైనా ఆలోపు అందకపోతే అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు, ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. ఒకవేళ 9లోపు రైతులందరికీ రూ.7,500 కోట్లు జమ చేస్తే.. క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేందుకు కేసీఆర్‌ సిద్ధమా’’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కొత్తకోట కురుమూర్తిస్వామి సాక్షిగా ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానన్నారు. గత భారాస ప్రభుత్వం తమపై రూ.7 లక్షల కోట్ల అప్పుల కుంపటి పెట్టినా.. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మే 9 వరకు అందరి ఖాతాల్లో ‘ఆసరా’ పింఛన్‌ సొమ్ము జమ చేస్తామన్నారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతామన్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు సమాధానం చెప్పాలన్నారు. భాజపాకు వేసే ప్రతి ఓటూ ప్రజాస్వామ్యం, రిజర్వేషన్లకు చేటు చేస్తుందన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో, వనపర్తి జిల్లా కొత్తకోటలో రోడ్‌షో, కూడలి సమావేశంలో, సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి, ముషీరాబాద్‌లలో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే రాజధాని నగరంలో అభివృద్ధి జరిగింది. అప్పట్లో ఎంపీగా ఉన్న అంజన్‌కుమార్‌, మంత్రిగా ఉన్న దానం నాగేందర్‌ అభివృద్ధి పనులు చేపట్టారు. 1.5 కోట్ల మంది తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి చేశారు. నగరంలో ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, నెక్లెస్‌ రోడ్‌ వంటివి కాంగ్రెస్సే తీసుకొచ్చింది. శిల్పారామం కూడా తీసుకొచ్చాం. నగరంలో పరుగులు పెడుతున్న మెట్రోరైలును వైఎస్‌, జైపాల్‌రెడ్డిలు అందుబాటులోకి తెచ్చారు. కాంగ్రెస్‌ అందుబాటులోకి తెచ్చిన ఐటీ, ఫార్మా పరిశ్రమలు, ఓఆర్‌ఆర్‌లను భారాస, భాజపాలు కాస్త అభివృద్ధి చేశాయి. విభజన హామీలు పదేళ్లైనా పూర్తి చేయకుండా రాష్ట్రానికి భాజపా గాడిదగుడ్డు ఇచ్చింది.

కత్తులు తీసుకుని బయలుదేరారు..

పాలమూరును అభివృద్ధి చేద్దామని, నీళ్లు ఇచ్చి పచ్చని పైర్లు పండించాలని, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని నేను చూస్తోంటే.. కుర్చీల్లోంచి దించేసేందుకు కొందరు కత్తులు, గొడ్డళ్లు తీసుకుని బయలుదేరారు. రేవంత్‌రెడ్డిని జైలుకు పంపైనా సరే.. రిజర్వేషన్లు రద్దు చేస్తామని భాజపా అంటోంది. ఆ పార్టీకి డి.కె.అరుణ వత్తాసు పలుకుతున్నారు. మోదీతో, అమిత్‌షాలతో మాట్లాడి దిల్లీ పోలీసులను తీసుకొచ్చారు. తనపై రేవంత్‌రెడ్డి పగబట్టారని, కాంగ్రెస్‌ను ఓడగొట్టేవరకు ఊరుకోబోనని ఆమె అంటున్నారు. పానగల్‌ నుంచి జడ్పీటీసీ సభ్యురాలిని చేసినందుకు, గద్వాల నుంచి ఎమ్మెల్యే చేసినందుకు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కాంగ్రెస్‌ను ఓడించాలా? పాలమూరును ఎడారిగా మార్చేలా, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునేలా కుట్ర జరుగుతోంది. దాన్ని తిప్పికొట్టాలి. సికింద్రాబాద్‌ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపిస్తే ఆయనను కేంద్రమంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు తీసుకురాలేదు. మూడేళ్ల క్రితం వరదలొస్తే కేంద్రం నుంచి రూ.పది కూడా తేలేదు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే, అభివృద్ధి ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలిపోతుంటే అడ్డుకోలేదు.

దేశానికి దిక్సూచి.. ఖమ్మం జిల్లా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ఉద్యమాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడి ప్రజలు 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 10 శాసనసభ స్థానాలకు గాను భారాసను ఒక్కో సీటుకే పరిమితం చేశారు. ఇదే స్ఫూర్తితో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలోని ప్రజలు కదలాలి. రెండుచోట్లా కాంగ్రెస్‌ అభ్యర్థులకు 3 లక్షల చొప్పున మెజారిటీ ఇవ్వాలి. దేశంలోనే అత్యధిక మెజారిటీ వచ్చిన లోక్‌సభ స్థానంగా ఖమ్మంను నిలపాలి. నేను కాంగ్రెస్‌లో చేరాక అహ్మద్‌ పటేల్‌ను కలిశాను. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22 జిల్లాలకు మాత్రమే సీఎం అని, ఖమ్మం జిల్లాలో ప్రతి కార్యకర్త సీఎం లాంటి శక్తిమంతుడే అని ఆయనకు అధిష్ఠానం చెప్పిందని అహ్మద్‌ పటేల్‌ గుర్తుచేశారు. అందుకే దేశానికి దిక్సూచిగా ఉండే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా తలదూర్చను’’ అని రేవంత్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

తప్పుడు కేసులకు కాంగ్రెస్‌ భయపడదు: భట్టి

రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి నినాదానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుందని.. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. కొత్తగూడెం సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిస్తాం. సింగరేణిని నిండా ముంచిన కేసీఆర్‌.. ఆ సంస్థ గురించి మాట్లాడటం తగదు. సింగరేణికి బొగ్గుబావులు అందకుండా చేసిందే భారాస ప్రభుత్వం’’ అని ధ్వజమెత్తారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇన్ని రోజులు, అన్ని రోజులు ఉంటుందని మాట్లాడుతున్న వారికి బుద్ధిచెప్పేందుకు లోక్‌సభ ఎన్నికలు ముమ్మాటికీ రిఫరెండమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా ఏమాత్రం ప్రభావం చూపదని, భారాసది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపాకు బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్రం ఎన్ని కేసులు పెట్టినా, గత భారాస ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా బెదరని చిరుత రేవంత్‌రెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి సంపదను కేసీఆర్‌, ఆయన కుటుంబం దోచేసిందని ఆరోపించారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎంపీ అభ్యర్థులు రఘురాంరెడ్డి(ఖమ్మం), బలరాంనాయక్‌(మహబూబాబాద్‌), వంశీచంద్‌రెడ్డి(మహబూబ్‌నగర్‌), మల్లు రవి(నాగర్‌కర్నూల్‌), ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, నాయకులు జితేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొత్తగూడెంలో సీఎం హెలికాప్టర్‌ను, కాన్వాయ్‌ను, ఖమ్మంలోని పుట్టకోట చెక్‌పోస్టు వద్ద వాహన శ్రేణిని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీ చేశారు.


భాజపా, భారాస గూడుపుఠాణి

లోక్‌సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో నామా నాగేశ్వరరావును కేంద్ర మంత్రి చేస్తానని కేసీఆర్‌ అంటున్నారు. ఏ ప్రభుత్వంలో చేరుతారో ఆయన చెప్పాలి. భారాస కాకిని కూడా కాంగ్రెస్‌ ఇంటిపై వాలనీయబోమని మా కార్యకర్తలు చెబుతున్నారు. ఇక మిగిలింది భాజపాతో కలవడమే. 2014 నుంచి 2023 వరకు మోదీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, పెద్ద నోట్లు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, జీఎస్టీ బిల్లు లాంటి అనేక చట్టాలకు కేసీఆర్‌ మద్దతిచ్చారు. కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో గెలవకుండా భాజపా, భారాస కలిసి గూడుపుఠాణి చేస్తున్నాయి. వాటి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.


హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది. రాజధాని నగరంలో ఐటీ, ఫార్మా పరిశ్రమలు మా హయాంలోనే వచ్చాయి. జంట నగరాల వాసులు తాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే కృష్ణా, గోదావరి జలాలను తీసుకువచ్చాం.

సీఎం రేవంత్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img