icon icon icon
icon icon icon

ఓట్లు దండుకునేందుకు కేసీఆర్‌ డ్రామాలు: బండి సంజయ్‌

భారాస అధినేత కేసీఆర్‌ మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు.

Published : 06 May 2024 03:34 IST

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: భారాస అధినేత కేసీఆర్‌ మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో వాకర్స్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర, కరీంనగర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేసేదొక్కటే.. గత పదేళ్ల పాలనలో కేసీఆర్‌ మోసాలు, పాపాలను గుర్తుంచుకోండి. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులను రోడ్డున పడేశారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్ట్‌లతో నానా ఇబ్బంది పెట్టారు. చివరకు ఫోన్‌ ట్యాపింగ్‌తో భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని స్థితికి తీసుకొచ్చారు. కృష్ణా నీటిని ఏపీకి దోచిపెట్టారు. అలాంటి కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు’’ అని సంజయ్‌ ప్రశ్నించారు.

హామీల అమలుకు డబ్బులు లేవా?

‘‘అనుకూల కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించడానికి, తెలంగాణ సొమ్ముతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయడానికి కాంగ్రెస్‌కు నిధులు ఉంటాయి. ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలుకు నిధులు లేవంటారా? ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రధాన నిందితుడు పంపిన డబ్బుతో కరీంనగర్‌లో కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కొంటున్నారు. ట్యాపింగ్‌ భాగస్వాములంతా అరెస్ట్‌ కావడం తథ్యం. కేటీఆర్‌ నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ వార్‌రూమ్‌ ఏర్పాటు చేసుకొని మా ఫోన్లను ట్యాపింగ్‌ చేసినట్లు కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావు చెప్పారు. కేసీఆర్‌ చెబితేనే ట్యాప్‌ చేశామని రాధాకిషన్‌రావు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇంత స్పష్టమైన ఆధారాలున్నా కేసీఆర్‌, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు. కాంగ్రెస్‌ కేసీఆర్‌తో కుమ్మక్కై విచారణను నీరుగారుస్తోంది. భారాస, కాంగ్రెస్‌ పార్టీల నైజాన్ని గ్రహించి ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి’’ అని బండి సంజయ్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img