icon icon icon
icon icon icon

రండి.. ఓటేయగ తరలిరండి!

హైదరాబాద్‌ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్‌ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు.

Published : 06 May 2024 03:35 IST

ఏపీలో ఓట్లున్న హైదరాబాద్‌ వాసులతో అక్కడి నేతల మంతనాలు

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-కేపీహెచ్‌బీ కాలనీ: హైదరాబాద్‌ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్‌ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి.. ఓటర్ల వివరాలు సేకరించారు. ఓటు వేసేందుకు ఏపీకి వెళ్లి, తిరిగి వచ్చేవారికి నేతల అనుచరులు రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పటికే కొందరు ప్రత్యేక బస్సులు బుక్‌ చేసుకోగా.. మరి కొంతమంది జీపులను సమకూర్చుకుంటున్నారు.

అదనంగా ఆర్టీసీ బస్సులు..

హైదరాబాద్‌ నగరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాలకు ఏపీఎస్‌ఆర్టీసీ రోజూ 350 బస్సులు నడుపుతుండగా.. టీఎస్‌ఆర్టీసీ కూడా దాదాపు అంతే సంఖ్యలో బస్సులు తిప్పుతోంది. ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో బస్సులకు డిమాండ్‌ పెరిగినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు రోజులకు కలిపి 500 బస్సులు అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా, రోజుకు అదనంగా 200 బస్సుల వరకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడిపే అవకాశం ఉందని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

వాహనాలు సమకూర్చేదెలా..

తెలుగు రాష్ట్రాల్లో రెండుచోట్లా మే 13నే ఎన్నికలు ఉండటంతో ఓటర్లను తరలించేందుకు వాహనాలు సమకూర్చడం ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ముఖ్య అనుచరులకు కత్తి మీద సాములా మారింది. తమకు తెలంగాణలో ఓట్లు ఉండడంతో ఇక్కడి వాహనదారులు ఏపీకి వచ్చేందుకు ఆసక్తి కనబర్చడం లేదని ఓ పార్టీ నేత తెలిపారు. సొంతంగా రవాణా సదుపాయం ఏర్పాటు చేసుకుంటే రానూపోనూ ఛార్జీలు ఇస్తామని కొందరు చెబుతున్నారు. ఇక రైళ్లలో వెళ్దామనుకునేవారికి రిజర్వేషన్లు అందుబాటులో లేవు. దీంతో జీపులు, మినీ బస్సుల్లో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img