icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌కు ఓటేస్తే అబద్ధాలకు ఆమోదం తెలిపినట్లే

‘కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయానికి కరెంటు 24 గంటల నుంచి 11, 12 గంటలకు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లే ఆడబిడ్డలకు కిట్లు నిలిచిపోయాయి.

Published : 06 May 2024 03:35 IST

చందుర్తి ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల- చందుర్తి, న్యూస్‌టుడే: ‘కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయానికి కరెంటు 24 గంటల నుంచి 11, 12 గంటలకు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లే ఆడబిడ్డలకు కిట్లు నిలిచిపోయాయి. గ్రామాల్లో మహిళలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కల్యాణలక్ష్మిలో తులం బంగారం ఊసేలేదు. నిర్మాణరంగ సామగ్రి, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటాయి’ అని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినందుకు నాలుగు నెలల్లోనే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే వాళ్ల అబద్ధాలకు ఆమోదం తెలిపినట్లవుతుందని పేర్కొన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో భారాస కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో హరీశ్‌రావు మాట్లాడారు.

‘‘ఆరు గ్యారంటీలు, పదమూడు హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్లు రాసి మీ చేతిలో పెట్టారు. ఆ బాండ్‌ పేపర్లు బౌన్స్‌ అయ్యాయి. మొదటి హామీ అయినా మహాలక్ష్మి పథకంలో ఒక్క పైసా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మహిళలందరికీ రూ.పది వేల బాకీ ఉంది. రూ.4 వేల పింఛను పడిన వారంతా కాంగ్రెస్‌కు, పడనివారు కారు గుర్తుకు ఓటువేయాలి. అధికారంలోకి వచ్చి అయిదు నెలలు గడుస్తున్నా నేటికీ ‘రైతుబంధు’ ఇవ్వలేదు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. ఈ నెల 9 వరకు పాత లెక్కన ఎకరానికి రూ.5 వేలు ఇస్తామంటున్నారు. పంట చేతికొచ్చిన తరవాత ఇచ్చేది రైతు భరోసా ఎలా అవుతుంది’’ అని హరీశ్‌ విమర్శించారు. 30 ఏళ్లు బీడీలు చుట్టిన వారికే పీఎఫ్‌ కింద పింఛను అందేలా భాజపా చట్టం తీసుకొచ్చిందని, ఆ పార్టీ వాళ్లు ఓట్ల కోసం వస్తే ఈ విషయంపై నిలదీయాలని హరీశ్‌రావు కోరారు.


ఆయన రాహుల్‌గాంధీ కాదు.. రాంగ్‌గాంధీ

సిద్దిపేట, న్యూస్‌టుడే: ‘తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని.. మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2500 జమ చేస్తున్నామని నిర్మల్‌ సభలో రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం తీవ్ర ఆక్షేపణీయమని హరీశ్‌రావు అన్నారు. ఆయన రాహుల్‌గాంధీ కాదు.. రాంగ్‌ గాంధీ అని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. నిర్మల్‌ సభలో రాహుల్‌ మాట్లాడిన దృశ్యాలు, కాంగ్రెస్‌ గ్యారంటీల పుస్తకాన్ని ప్రదర్శిస్తూ సిద్దిపేటలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ హామీల అమలుపై రాహుల్‌గాంధీ లేక సీఎం రేవంత్‌రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్‌ విసిరారు. ఈ అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. గ్యారంటీలకు గ్యారంటీగా ఉండాల్సిన రాహుల్‌.. కంచే చేను మేసినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img