icon icon icon
icon icon icon

రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా?

తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు సాధించేందుకు, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 06 May 2024 03:36 IST

రిజర్వేషన్లపై సీఎం మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు
కాంగ్రెస్‌ గద్దె దిగేందుకు ఐదేళ్లు చాలా ఎక్కువ
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు భాజపాకే
భారాసకు ఓటు వేస్తే వృథాయే
మీట్‌ ది ప్రెస్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు సాధించేందుకు, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మరోసారి మోదీ ప్రభుత్వం(ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌) అనేది భాజపా నినాదంగా కాకుండా ప్రజానినాదంగా మారిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో సునామీలాంటి ‘అండర్‌ కరెంట్‌’ పరిస్థితి కనబడుతోందని జూన్‌ 4న వెలువడే ఫలితాల్లో ఈ ప్రభంజనాన్ని చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస గద్దె దిగేందుకు పదేళ్లు పడితే కాంగ్రెస్‌కు ఐదేళ్లు చాలా ఎక్కువ అని చెప్పారు. రాష్ట్రానికి రూ.9 లక్షలకోట్లు ఇస్తే కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటారా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. ఈ వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. భారాస ఒక ఎంపీ సీటు గెలిచినా గెలవకున్నా రాష్ట్రానికి వచ్చే లాభం లేదు.. ఆ పార్టీకి ఓటు వేస్తే వృథాయే అని అన్నారు. అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్‌ పార్టీయా? అవినీతిరహిత పాలన, శక్తిమంతమైన నాయకత్వం అందించే భాజపా కావాలా? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(టీయూడబ్ల్యూజేె) ఆదివారం నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ, సీనియర్‌ జర్నలిస్ట్‌ రవికాంత్‌రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘వికసిత భారత్‌ లక్ష్యంగా భాజపా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 32 ఏళ్ల తర్వాత 2014లో దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. పదేళ్ల ముందు దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, శాంతిభద్రతలు లోపించడం, ఆర్థిక సంక్షోభాలు, అవినీతి, కుంభకోణాలే చర్చనీయాంశంగా ఉండేవి. ఇప్పుడు దేశంలో పూర్తిగా పరిస్థితి మారిపోయింది. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై, మంత్రులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. దేశంలో మతకలహాలు, కర్ఫ్యూలు, శాంతిభద్రతల సమస్యలు లేవు. దేశంలో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా జరుగుతోంది. రూ.26 వేల కోట్లతో నిర్మించే రీజినల్‌ రింగ్‌రోడ్డు రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌గా మారుతుంది. రూ.300 కోట్లతో చర్లపల్లిలో చేపట్టిన కొత్త రైల్వే టెర్మినల్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఆగస్టులో ప్రధాని జాతికి అంకితం చేస్తారు.

ప్రధాని స్పష్టం చేసినా దుష్ప్రచారం చేస్తారా?

తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ చెప్పిన తర్వాత కూడా దుష్ప్రచారం చేస్తారా? రాజకీయాల్లో బాధ్యతతో ఉండాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడతారు? రిజర్వేషన్లు తీసేస్తామని సీఎం చేస్తున్న దుష్ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చింది.. పత్రికాస్వేచ్ఛను హరించింది కాంగ్రెస్‌ కాదా? పేదరికం నుంచి అన్ని వర్గాలు బయటకు వచ్చేవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. భాజపా ఎక్కువ సీట్లు గెలుస్తుందని అర్థమై పార్టీలో తన అస్తిత్వానికి ఎక్కడ నష్టం జరుగుతుందో అని సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడుతున్నారు. భాజపాలో ఇతర పార్టీల నాయకులు చేరితే స్వాగతిస్తాం’’అని కిషన్‌రెడ్డి చెప్పారు.


ప్రభుత్వాన్ని కూల్చం.. నాలుగున్నరేళ్లు వేచి చూస్తాం

తెలంగాణలో భాజపాకు మెజారిటీ స్థానాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉండదనే అంశంపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన భాజపాకు లేదు. ఆ పార్టీ అంతర్గత కలహాలతో కూలిపోతే మాకు సంబంధం లేదు. మేం నాలుగున్నరేళ్ల వరకు వేచి చూస్తాం. అప్పటివరకు బలాన్ని పెంచుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే చర్చ ఎక్కడైనా జరిగిందా? మాజీ మంత్రి కేటీఆర్‌కు అధికారం పోయిన తర్వాత పీడకలలు పెరిగిపోయాయి. అందుకే అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. అవినీతి, అహంకార, నియంతృత్వ భారాసతో ఎప్పటికీ కలిసే ప్రసక్తే లేదు. మతపరమైన రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. దేశంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు మతాలతో సంబంధం లేకుండా పదిశాతం ఈబీసీ రిజర్వేషన్లను కేంద్రం కల్పించింది. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ లాభదాయకం కాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది’’ అని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img