icon icon icon
icon icon icon

దిల్లీ పోలీసుల పేరుతో వేధింపులు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియోను మార్ఫింగ్‌ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దిల్లీ పోలీసుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు తమ పార్టీ ఐటీ సెల్‌ ఉద్యోగులను వేధిస్తున్నాయని తెలంగాణ ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆదివారం డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డిలకు ఫిర్యాదు చేశారు.

Published : 06 May 2024 03:36 IST

కాంగ్రెస్‌ నాయకుడు మెట్టు సాయికుమార్‌ ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియోను మార్ఫింగ్‌ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దిల్లీ పోలీసుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు తమ పార్టీ ఐటీ సెల్‌ ఉద్యోగులను వేధిస్తున్నాయని తెలంగాణ ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆదివారం డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డిలకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలు మీడియాకు విడుదల చేశారు. పలువురు దిల్లీ పోలీసులమని చెబుతూ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలోని తమ ఐటీ సెల్‌ ఉద్యోగుల వద్దకు వెళ్లి, వారి ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లు చూపించాలంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్యలతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


భాజపా చర్యలను దీటుగా ఎదుర్కొంటాం: రామచంద్రారెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీ పోలీసులను అడ్డు పెట్టుకుని.. భాజపా తెలంగాణలో అనైతిక చర్యలకు పాల్పడుతోందని పీసీసీ న్యాయ సలహాదారు, అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలు, సోషల్‌ మీడియా ప్రతినిధులు దిల్లీ పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. అయినా హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. భాజపా చర్యలను కాంగ్రెస్‌ పార్టీ దీటుగా ఎదుర్కొంటుందని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img