icon icon icon
icon icon icon

ఎన్నికల తర్వాత రేవంత్‌ భాజపాలోకి..

లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 06 May 2024 03:37 IST

గ్యారంటీల అమలులో సీఎం విఫలం
మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు

కర్మన్‌ఘాట్, హబ్సిగూడ - న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని కర్మన్‌ఘాట్ చౌరస్తా రోడ్డు, ఉప్పల్‌, రాంనగర్‌ చౌరస్తాల్లో రోడ్‌ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో అసత్యాలు చెప్పించారు. ప్రధాని మోదీని రాహుల్‌ గాంధీ విమర్శిస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసిస్తున్నారు. రేవంత్‌రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ కావాలో.. కరెంటు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనే రోజులు రావడం కాంగ్రెస్‌ ఘనతే. రాష్ట్రంలో భారాసకు 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే, కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు. ఎంతమంది బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేశారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. దేవుడు, మతం పేరుతో మూడోసారి అధికారంలోకి రావడానికి భాజపా చూస్తోంది. మోదీ హయాంలో ధరలు పెరగడం తప్ప.. ఏమీ జరగలేదు. భారాస పదేళ్లలో 36 ఫ్లైఓవర్లు నిర్మిస్తే.. ఉప్పల్‌, అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణాలను కేంద్రం నేటికీ పూర్తి చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్‌ ఆధ్యాత్మికతతో యాద్రాదిలో నూతన ఆలయం నిర్మించారు.. అయినా ఏనాడూ దేవుడి పేరిట రాజకీయం చేయలేదు’’ అని పేర్కొన్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ భారాస అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావు; ఎల్బీనగర్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి; ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్‌ గుప్తా తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img