icon icon icon
icon icon icon

రిజర్వేషన్లు విస్తరించిందే భాజపా: లక్ష్మణ్‌

‘‘ఈ ఎన్నికలు వార్డుకో, మున్సిపాలిటీకో జరుగుతున్నవి కాదు.. దేశం కోసం జరుగుతున్నవి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ప్రజలు ఆచితూచి ఓటేయాలి’’ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

Published : 06 May 2024 03:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఈ ఎన్నికలు వార్డుకో, మున్సిపాలిటీకో జరుగుతున్నవి కాదు.. దేశం కోసం జరుగుతున్నవి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ప్రజలు ఆచితూచి ఓటేయాలి’’ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే.. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని, అప్పుడే హామీలను నెరవేర్చడం సాధ్యమవుతుందంటూ సీఎం రేవంత్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ గెలిచేది లేదు.. రాహుల్‌ ప్రధాని అయ్యేది లేదన్నారు. పదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం రిజర్వేషన్లను భాజపా సర్కార్‌ తొలగించలేదని, పైగా విస్తరించిందని తెలిపారు. పేదరికంలో ఉన్న అగ్రకులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది మోదీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. రాష్ట్రంలో భారాస పార్టీ చచ్చిన పాము, కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ అంటూ ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని భాజపాకు కట్టబెట్టాలని.. ఈటల రాజేందర్‌ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని లక్ష్మణ్‌ కోరారు.

సుభిక్షం, సురక్షితం మోదీతోనే సాధ్యం: ఈటల

‘అలవి కాని హామీలిచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతోంది.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని భాజపా మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలన్నారు. 30 ఏళ్లుగా గుజరాత్‌లో భాజపా సర్కార్‌ ఉన్నా... అక్కడ రిజర్వేషన్లు ఏమీ తొలగించలేదని గుర్తు చేశారు. తెలంగాణలో భాజపాకు విజయం చేకూర్చాలని కోరారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ అభ్యర్థి వంశ తిలక్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌, బేతి సుభాష్‌రెడ్డి, భాజపా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితరులు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img