icon icon icon
icon icon icon

ప్రజలను కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం

‘‘లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు తొలగించి ప్రజలందరినీ కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం. అందుకే ఓట్ల కోసం, సీట్ల కోసం రామజపం చేస్తోంది.

Published : 06 May 2024 03:38 IST

దేవుడంటే ఓట్లు, రాముడంటే సీట్లు, హనుమాన్‌ అంటే అధికారం
అదే వారి ధోరణి: సీఎం రేవంత్‌

ఈనాడు-హైదరాబాద్‌, మహేశ్వరం, శంషాబాద్‌, న్యూస్‌టుడే: ‘‘లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు తొలగించి ప్రజలందరినీ కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం. అందుకే ఓట్ల కోసం, సీట్ల కోసం రామజపం చేస్తోంది. వారికి దేవుడంటే ఓట్లు, రాముడంటే సీట్లు, హనుమాన్‌ అంటే అధికారం.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపాను చిత్తుగా ఓడించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి మద్దతుగా తుక్కుగూడ, శంషాబాద్‌లలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు. ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారు. రిజర్వేషన్ల తొలగింపుపై మాట్లాడితే మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ అమిత్‌షా దిల్లీ పోలీసులతో కేసులు పెట్టించి భయపెడుతున్నారు. తెలంగాణలో పర్యటించిన ఆయన రాష్ట్రాభివృద్ధిపై ఏమీ మాట్లాడలేదు.

రేషన్‌ బియ్యంతో ఇక్కడే అక్షింతలు చేసి..

అయోధ్యలో రాముడి గుడి కట్టించాం, ప్రజలకు అక్షింతలు పంపిణీ చేస్తున్నామంటూ రాముడి పేరుతో రాజకీయం చేస్తారా? శ్రీరాముడి కల్యాణం తర్వాత అక్షింతలను ఇంటింటికీ పంపడం సంప్రదాయం. మీరు ఇక్కడే రేషన్‌ బియ్యానికి పసుపు కలిపి అయోధ్య రాముడి అక్షింతలంటూ భక్తులను మోసం చేశారు. అయోధ్యలో రాముడి గుడి ప్రతిష్ఠ ఎప్పుడు చేశారో చెప్పాలి. కల్యాణం కంటే ముందే అక్షింతలు పంపలేదని భాజపా నాయకులు భద్రాచలం రాముడి గుడిలో ప్రమాణం చేయగలరా? భాజపా, భారాస సెంటిమెంట్‌లను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాయి. రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన భాజపా అదానీ కంపెనీకి రూ.లక్షల కోట్లు ధారాదత్తం చేస్తే... తెలంగాణ సెంటిమెంట్‌ పేరిట తండ్రీకొడుకులు రూ.వేల కోట్లు దోచుకున్నారు. జన్వాడలో రూ.వెయ్యి కోట్లతో ఒకరు, గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల్లో మరొకరు ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. భారాస తరఫున ప్రచారం చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికీ భాజపా అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికి ఓట్లు వేయాలని చెబుతున్నారు. మీకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్‌ను, కార్యకర్తలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పాడేందుకు శ్రీకారం చుట్టిన తుక్కుగూడ రాజీవ్‌గాంధీ ప్రాంగణానికి చరిత్ర ఉంది. ఇక్కడ రంజిత్‌ రెడ్డిని గెలిపిస్తే ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి సాగు, తాగునీటి పథకాలకు జాతీయ హోదా కల్పిస్తాం’ అని రేవంత్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితాహరినాథ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, కస్తూరి నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img