icon icon icon
icon icon icon

మరో పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వమే

‘‘రైతు భరోసా డబ్బులు పడలేదని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీలోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే బాధ్యత మా ఇందిరమ్మ ప్రభుత్వానిది.

Updated : 06 May 2024 04:33 IST

నిర్మల్‌, ఎర్రవల్లి జనజాతర సభల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈనాడు, మహబూబ్‌నగర్‌- ఈటీవీ, ఆదిలాబాద్‌

‘‘రైతు భరోసా డబ్బులు పడలేదని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీలోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే బాధ్యత మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. రైతు రుణమాఫీ గురించి హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆగస్టు 15లోగా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు చేసినప్పటికీ కేటీఆర్‌ విమర్శిస్తున్నారు. గత డిసెంబరులో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్‌ మాత్రమే. అప్పుడు కేసీఆర్‌ను ఓడించాం. మే 13న తెలంగాణ, గుజరాత్‌కు మధ్య ఫైనల్స్‌ జరుగుతుంది. ఫైనల్స్‌లో గుజరాత్‌ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్‌, అలంపూర్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పదేళ్లపాటు.. అంటే ప్రస్తుతం నాలుగున్నరేళ్లు. మరలా మరో అయిదేళ్లు.. కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. మూతపడిన సిమెంటు పరిశ్రమను తెరిపిస్తాం. ఆదిలాబాద్‌ అంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలుసు. నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యాక ప్రధాని మోదీ పెంచిన పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌, నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా మొట్టమొదటి కార్యక్రమం నిర్మల్‌ నియోజకవర్గం నుంచే చేపట్టాం. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత, గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే సమరశంఖం పూరించాం. ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుని.. అభివృద్ధి చేసే బాధ్యత నాది. కారు పాడై షెడ్డుకు పోయిందని కేసీఆర్‌ అంటున్నారు. కారు కార్ఖానా నుంచి ఇక రాదు. తూకానికి విక్రయించాల్సిందే. గద్వాలలో కాంగ్రెస్‌ని ఓడగొట్టడానికి శాసనసభ ఎన్నికల్లో భారాస, భాజపాలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే భాజపా తెలంగాణకు ఏమిచ్చింది అంటే గాడిద గుడ్డు. అలాంటి పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టాలా? వద్దా?’’ అని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలో నిలిచిన మహిళ, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను లక్ష ఓట్ల ఆధిక్యంతో, అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థి మల్లు రవిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.


రాష్ట్ర సంపదను భారాస దోచుకుంది: భట్టి

భారాస పదేళ్లపాటు ఈ రాష్ట్ర సంపద, వనరులను దోచుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎర్రవల్లి సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. దేశసంపద, వనరులు ప్రజలకు చెందాలన్నారు. కానీ మోదీ పాలనలో కొంతమంది ఆయన మిత్రులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ప్రజలు నష్టపోతున్నారంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. నిర్మల్‌ సభలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, నేతలు వేణుగోపాలాచారి, రేఖానాయక్‌, విశ్వప్రసాద్‌, నరేశ్‌జాదవ్‌, శ్యాంనాయక్‌, నారాయణరావు పటేల్‌, రాములునాయక్‌, అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు. ఎర్రవల్లి సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌధరి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, నేతలు తిరుపతయ్య, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img