icon icon icon
icon icon icon

భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దు

ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు.

Published : 06 May 2024 03:40 IST

వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం
ఆ కుట్రల్ని తిప్పికొట్టేందుకే మా పోరాటం
కాంగ్రెస్‌ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ
మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఏటా రూ.లక్ష
యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం
నిర్మల్‌, ఎర్రవల్లి జనజాతర సభల్లో రాహుల్‌గాంధీ

ఈనాడు, మహబూబ్‌నగర్‌- ఈటీవీ, ఆదిలాబాద్‌: ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. భాజపా, ఆరెస్సెస్‌లది రాజ్యాంగాన్ని మార్చే సమూహమన్నారు. ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలోని నిర్మల్‌, ఎర్రవల్లిలలో ఆదివారం జరిగిన జనజాతర సభల్లో రాహుల్‌ ప్రసంగించారు. ఆదివాసీ, దళిత, మైనారిటీ, బీసీలకు ఏదైనా దక్కిందంటే అది రాజ్యాంగం పుణ్యమే అంటూ రాజ్యాంగంపుస్తకాన్ని ప్రదర్శించారు. భాజపా ఈ పుస్తకాన్ని నలిపివేయాలని చూస్తోందని మండిపడ్డారు. అంబేడ్కర్‌, గాంధీల ఆశయాల్ని తుంచేయాలని కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. ప్రజల తరఫున కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేసి ఆ కుట్రల్ని తిప్పి కొడుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీతో పాటు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. రిజర్వేషన్లను పెంచుతామన్నారు. ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆత్రం సుగుణ, మల్లు రవిలను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘‘దేశంలో ప్రస్తుతం రెండు సమూహాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతుంటే.. మరోవైపు భాజపా, ఆరెస్సెస్‌ రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం పేదలకు అందిన జల్‌, జంగల్‌, జమీన్‌, హక్కులు, ఉద్యోగాలు, ఉపాధి లాంటి వనరులన్నీ రాజ్యాంగం ప్రసాదించినవే. ఒకవేళ రాజ్యాంగాన్ని తొలగిస్తే రిజర్వేషన్లు రద్దయినట్లే. దేశంలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రక్షణ సంబంధిత పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు.. అన్నిటినీ ఒక్కరికే కట్టబెట్టారు. ఈ పదేళ్లలో 22 మంది ధనికుల కోసమే మోదీ రూ.16 లక్షల కోట్లను మాఫీ చేశారు. ఆ సొమ్ముతో 24 ఏళ్ల పాటు పేదలకు ఉపాధి హామీ కింద పనులు కల్పించవచ్చు. కేవలం 22 మంది ధనికుల వద్దనున్న డబ్బు దేశంలోని 70 కోట్ల మంది పేదల దగ్గరున్న సొమ్ముతో సమానం. ఈ ధనాన్ని కాంగ్రెస్‌ పేదల వద్దకు చేర్చాలనుకుంటోంది.

మేం గద్దెనెక్కితే దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు

తెలంగాణ ప్రజలకు మేం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి చూపించాం.  30 వేల మంది యువతకు ఉద్యోగాలిచ్చాం. మహిళల బ్యాంకు ఖాతాల్లో ఇక్కడి ప్రభుత్వం ప్రతినెలా రూ.2500 వేస్తోంది. చేయూత కింద ఒక్కొక్కరికీ రూ.10లక్షల ఆరోగ్యబీమా అందుతోంది. గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా కల్పిస్తున్నాం. దిల్లీలో కాంగ్రెస్‌ గద్దెనెక్కితే దేశవ్యాప్తంగా ఈ పథకాల్ని అమలు చేస్తాం. దేశ యువతను మోదీ నిరుద్యోగులుగా మార్చారు. మేం దేశంలోని నిరుద్యోగ యువతకు పక్కా ఉద్యోగం ఇచ్చేలాకొత్త పథకం తెస్తాం. దేశంలో ప్రస్తుతమున్న 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం. దేశంలోని ప్రతి గ్రాడ్యుయేట్‌కు పబ్లిక్‌, ప్రైవేటు సెక్టార్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో, విశ్వవిద్యాలయాల్లో ఏడాదిపాటు రూ.లక్ష వేతనంతో కూడిన ఉద్యోగం తప్పనిసరిగా కల్పిస్తాం. ఏడాదిలో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగం శాశ్వతమవుతుంది. అప్పుడు దేశంలోని యువత సుశిక్షిత సైన్యంగా మారుతుంది. ప్రపంచంలోనే ఇదివరకు ఎన్నడూ లేని పథకమిది.

ఉపాధి హామీ కూలి రూ.400కు పెంచుతాం

ఆదివాసీలకు భూముల, అటవీహక్కుల సమస్యలున్నాయి. వాటిని త్వరలో పరిష్కరించబోతున్నాం. భూమిపై మొదటి హక్కులు కలిగిన వ్యక్తులు ఆదివాసీలే. తెలంగాణలో జల్‌, జంగల్‌, జమీన్‌పై ఇక్కడి ప్రభుత్వం సర్వహక్కులు కల్పించబోతోంది. ప్రస్తుతం ఉపాధి హామీ కింద రూ.250 కూలి అందుతోంది. దీన్ని రూ.400కు పెంచుతాం. మహిళల పింఛను రెట్టింపు చేస్తాం. తెలంగాణలో పురుషులు 8 గంటలు పనిచేస్తే.. మహిళలు ఇంటాబయటా 16 గంటలు పనిచేస్తారు. కానీ మహిళలు ఇంట్లో చేసిన పనికి ఎలాంటి ఆదాయం లభించదు. అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గొప్ప పథకం తీసుకొస్తాం. ప్రపంచంలో ఇంతవరకు ఏ పార్టీ చేయనట్లుగా... దేశంలోని పేదలందరి జాబితా రూపొందించబోతున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఎంచుకుంటాం. ఆమె బ్యాంకు ఖాతాలో ఏటా రూ.లక్ష వేయనున్నాం. ప్రతి నెల రూ.8500 ఖాతాలో పడతాయి. తెలంగాణలోని పేద మహిళలకు ఇక్కడి ప్రభుత్వం ఏటా రూ.30 వేలు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరో రూ.లక్ష అందుతుంది. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పెంపు

రిజర్వేషన్లకు మోదీ శత్రువు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజల నుంచి వాటిని లాక్కోవాలని చూస్తున్నారు. రిజర్వేషన్లను 50 శాతం కంటే ఎక్కువగా పెంచడం ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్య. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దాన్ని పెంచుతామని మ్యానిఫెస్టోలో స్పష్టం చేశాం. రిజర్వేషన్లను తీసేసేందుకే మోదీ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. అగ్నివీర్‌ అందులో భాగమే. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలను తీసేసి.. అన్నీ శాశ్వత ఉద్యోగాలే ఉండేలా చేస్తాం. మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఇక్కడ విద్వేషపు వీధుల్లో ప్రేమపూరిత దుకాణాలు తెరిచాం. కేంద్రంలోనూ ఇదే చేయబోతున్నాం. పేదల ప్రభుత్వాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నాం

దేశంలో 50 శాతం మంది వెనకబడిన వర్గాలు.. 15 శాతం దళితులు.. 8 శాతం ఆదివాసీలు.. 15 శాతం మైనారిటీలు.. 5-6 శాతం మంది అగ్రవర్ణ పేదలున్నారు. వీరందరినీ కలిపితే 90 శాతం కంటే ఎక్కువే. కానీ దేశంలోని ఏ సంస్థలోనైనా వీరికి సరైన అవకాశాల్లేవు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 90 మంది బ్యూరోక్రాట్లలో ముగ్గురు దళితులు, ముగ్గురు వెనకబడిన కులాలవారు, ఒక్క ఆదివాసీ మాత్రమే ఉన్నారు. కేంద్రం ఖర్చు చేస్తున్న ప్రతి 100 రూపాయల్లో దళిత, ఆదివాసీ, వెనకబడిన వర్గాలకు కేవలం రూ.6.10 మాత్రమే కేటాయిస్తోంది. 8 శాతమున్న ఆదివాసీలకు బడ్జెట్‌లో 10 పైసలు మాత్రమే ఇస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నాం. దీనిద్వారా దళిత, ఆదివాసీ, వెనకబడిన, మైనారిటీ వర్గాలకు అధికారం వస్తుంది. దేశంలోని ప్రతి సంస్థలో ఆర్థికసర్వే చేయిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img