icon icon icon
icon icon icon

పాతవి లేవు.. కొత్త పథకాలు రావు

‘తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది.

Published : 06 May 2024 03:41 IST

ఈ ప్రభుత్వానికి ఏం రోగమొచ్చింది?
ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది
ఎన్నికలు మధ్యలో వచ్చినా.. చివర్లో వచ్చినా మళ్లీ మనదే అధికారం
కృష్ణా, గోదావరి నీళ్లపై మోదీ కుట్ర
జగిత్యాల రోడ్‌ షో, వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్‌

కరీంనగర్‌-ఈనాడు, జగిత్యాల, వీణవంక-న్యూస్‌టుడే: ‘తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. చివరి దాకా మనగలిగే ప్రభుత్వం కాదిది. ఈ బాధ పోవాలి. ఎన్నికలు మధ్యలో  వచ్చినా.. చివర్లో వచ్చినా.. మళ్లీ మనదే అధికారం’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. జగిత్యాలలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్‌ షోలో, అంతకుముందు కరీంనగర్‌ జిల్లా వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద ప్రజలు, రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ ప్రభుత్వానికి ఏం రోగమొచ్చింది. కొత్త పథకాలు అమలు చేస్తలేరు. పాతవి కొనసాగిస్తలేరు. రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారు. ఏ వర్గానికీ ఏమీ రావడం లేదు. రుణమాఫీ, తులం బంగారం, కేసీఆర్‌ కిట్‌, ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇలా ఏవీ అందట్లేదు. నిర్మల్‌ సమావేశంలో రాహుల్‌గాంధీ మహిళలకు రూ.2,500 ఇస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుడు తప్ప..  చేసిందేమీ లేదు.

ఆదర్శంగా నిలిపాం..

కొత్త రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా చక్కపెడుతూ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపాం. మేం ఎంతో కష్టపడి రూ. వందల కోట్ల పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూశాం. కాంగ్రెస్‌ హయాంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా వెళ్లిపోతోంటే బాధనిపిస్తోంది. కరెంట్‌ గోసను తీర్చుకున్నాం. ఫ్లోరైడ్‌ సమస్య, వలసల బాధను పోగొట్టుకున్నాం. 55 లక్షల మెట్రిక్‌ టన్నులు పండే ధాన్యాన్ని మూడున్నర కోట్ల మెట్రిక్‌ టన్నుల స్థాయికి తీసుకెళ్లాం. సంక్షేమ రంగంలో ఎన్నో ఫలితాలు సాధించాం. ఇంకా ఎన్నో చేయాలనుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు.

రైతుబంధును ఐదెకరాలకే పరిమితం చేస్తారట..

రెండు దగ్గర నాలుగు వేలు వస్తాయని కొందరు.. ఇంకేమో చేస్తారని ఇంకొందరు నమ్మి అటు ఓటు వేసి మోసపోయారు. ప్రస్తుత ప్రభుత్వ మర్మం తెలిసిపోయింది. అందుకే తెలంగాణ మర్లవడుతోంది. డిసెంబరు 9న వేస్తామన్న రైతు రుణమాఫీ పైసలు ఏమాయె.. రైతుబంధు నాటేసేటప్పుడు ఇస్తారా? లేక కోతలు కోసేటప్పుడు ఇస్తారా? దుక్కి దున్నిన వాళ్లకే రైతుబంధు వేస్తారట. అయిదెకరాలకే పరిమితం చేస్తారట. ఆరేడు ఎకరాల వాళ్ల పరిస్థితి ఏంది? కటాఫ్‌ పెట్టాలనుకుంటే 20-25 ఎకరాలకు పెట్టాలి. నేను వస్తుంటే దారి పొడుగునా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. కొనుగోలు జరగట్లేదు. బోనస్‌ అందట్లేదు. పేపర్లో వార్తలు చూస్తే బాధేస్తోంది. వరంగల్‌ ఎంజీఎంలో చిన్నపిల్లల తల్లులు బాధపడుతున్నారు. గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖానాల్లో పడుతున్నారు. వరద కాలువలు, పంట పొలాలు ఎండటానికి ఎవరు కారకులో ఆలోచించండి. ఇన్నేళ్లు చక్కగా వచ్చిన కరెంట్‌ ఇప్పుడెందుకు వస్తలేదు. నీళ్లు ఎందుకు ఇస్తలేరు. ఇన్నాళ్లు నడిచింది అలాగే నడిపిస్తే సరిపోయేది కదా? ఎందుకింత నిర్లక్ష్యం? ఉన్న గోచిని కూడా గుంజుకున్నట్లుంది ప్రభుత్వం తీరు. పరిపాలనా దక్షత వాళ్లకు లేదు. మళ్లా మనమే బాగు చేసుకోవాలి.

నా గుండె చీలిస్తే తెలంగాణనే..

తెలంగాణ ప్రజలిచ్చిన బలంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నా గుండె చీలిస్తే.. అందులో తెలంగాణనే కనిపిస్తుంది. బతికి ఉన్నంత సేపు తెలంగాణ కోసమే పోరాడతా. భారాస గెలుపుతోనే తెలంగాణ విజయం ముడిపడి ఉంది.

మోదీ హయాంలో ‘చచ్చేదిన్‌’

2019లో నలుగురు భాజపా ఎంపీలు గెలిచినా వాళ్లు తెలంగాణకు చేసిందేమీ లేదు. కృష్ణా, గోదావరి నీళ్లను పక్క రాష్ట్రాలకు తరలించాలని మోదీ కుట్ర చేస్తున్నారు. గోదావరి పోతే మనకు మంచినీళ్లు, సాగు నీళ్లు ఆగమైతాయి. మోదీ ప్రధాని అయి పదేళ్లు అయింది. అచ్చేదిన్‌ స్థానంలో చచ్చేదిన్‌ వచ్చాయి. అడ్డగోలు ధరలతో దగా జరిగింది. జన్‌ధన్‌ ఖాతాల్లోకి రూ.15 లక్షలు రాలేదు. రూపాయి విలువ పడిపోయింది. మోదీ హయాంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. మనల్ని నూకలు తినమని చెప్పిన నూకరాజు ఈ మోదీ. మోదీ మాటలకు రేవంత్‌రెడ్డి డప్పుకొడుతున్నారు. గిరిజన రిజర్వేషన్‌ పెంచాలని మేము ప్రయత్నించాం. హైకోర్టులో జడ్జి అడిగితే ఈ ప్రభుత్వం శాస్త్రీయంగా లెక్కలేసి చెప్పలేదు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో బలంగా మాట్లాడాలంటే భారాస ఎంపీలు గెలవాలి.  భాజపా ఎంపీలు గెలిస్తే మోదీ వద్ద చేతులు కట్టుకుని నిలబడతారు. అదే భారాస వాళ్లు గెలిస్తే పార్లమెంటు దద్దరిల్లే విధంగా కొట్లాడతారు. మన హక్కులను కాపాడతారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. భారాస అభ్యర్థులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌), కొప్పుల ఈశ్వర్‌ (పెద్దపల్లి), బాజిరెడ్డి గోవర్ధన్‌ (నిజామాబాద్‌), ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌, గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్‌ కె.సంజయ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు బస్సు యాత్ర కొనసాగగా.. జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.

కొండగట్టు వద్ద చాయ్‌ తాగిన కేసీఆర్‌

మల్యాల, న్యూస్‌టుడే: కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం జగిత్యాలలో జరిగే రోడ్డుషో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ మార్గంమధ్యలో మల్యాల మండలం కొండగట్టు స్టేజీ సమీపంలోని ఓ హోటల్‌ వద్ద ఆగారు. అక్కడ సమోసా తిని టీ తాగారు. చిన్నారులతో ముచ్చటించారు. స్థానికులు ఆయనతో సెల్ఫీలు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img