icon icon icon
icon icon icon

రిజర్వేషన్లు రద్దు కావు

కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు.

Updated : 06 May 2024 06:13 IST

భాజపా అధికారంలో ఉన్నంతకాలం ఉంటాయ్‌
కాంగ్రెస్‌ వస్తే కుంభకోణాలే
దేశంలో కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చుకు.. తెలంగాణ నుంచి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌..
లిక్కర్‌ స్కాంలో తిన్నది ఎంతో కేసీఆర్‌ చెప్పాలి
కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ సభల్లో అమిత్‌షా

ఈనాడు, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌; కంటోన్మెంట్‌, కార్ఖానా, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. ఇలాంటి కుట్రలను నమ్మొద్దని కోరారు. కేంద్రంలో పదేళ్లపాటు పూర్తి మెజార్టీతో ప్రధానిగా ఉన్న మోదీ.. ఆ ఆధిక్యంతో ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేయటానికి, రామమందిరం నిర్మాణానికి, పీఎఫ్‌ఐ వంటి సంస్థలు లేకుండా చేయటానికి వాడారే కాని రిజర్వేషన్లను రద్దు చేయటానికి కాదని గుర్తుంచుకోవాలన్నారు. అమిత్‌షా ఆదివారం కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలకు హాజరయ్యారు. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, నిజామాబాద్‌ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం అభ్యర్థి వంశ తిలక్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా సభల్లో అమిత్‌షా... కాంగ్రెస్‌, భారాసలపై నిప్పులు చెరిగారు. ‘‘రిజర్వేషన్ల రద్దు అని నేను అన్నట్లుగా రేవంత్‌రెడ్డి ఫేక్‌ వీడియో తయారు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. అది మంచి పద్ధతి కాదని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దిల్లీ పోలీసులు తన వెంట పడుతున్నారని సీఎం అంటే ఎలా? ఫేక్‌ వీడియోలు తయారు చేస్తే పోలీసులే కదా వచ్చేది. రాష్ట్రంలో 12 లోక్‌సభ స్థానాల్లో భాజపాను గెలిపిస్తే తెలంగాణను నంబర్‌ 1 రాష్ట్రంగా చేస్తా.

నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం

ఈ సారి కేంద్రంలో అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని లేకుండా చేస్తాం. మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలలో నక్సలిజం నశించింది. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే మిగిలి ఉంది. ఈ దఫా అధికారంలోకి వచ్చాక అక్కడ కూడా ఉండదు. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. కాంగ్రెస్‌ పాలనలో చొరబాట్లు, బాంబు పేలుళ్లు సాధారణంగా ఉండేవి. పుల్వామా ఘటనకు మనదేశం ఉగ్రవాదులకు దీటుగా సమాధానం ఇచ్చింది. ఇక్కడ ఉన్నది సోనియా, మన్మోహన్‌ సర్కార్‌ కాదు.. మోదీ సర్కార్‌ అని పాకిస్థాన్‌కు తెలిసేలా చేశాం.

మన వాళ్లు పాకిస్థాన్‌లోకి చొరబడి సర్జికల్‌, ఎయిర్‌స్ట్రైక్స్‌ చేసి ఉగ్రవాదులను తుదముట్టించారు. ఇప్పుడు మన జోలికి వచ్చే సాహసం వాళ్లు చేయడంలేదు. కశ్మీర్‌తో రాజస్థాన్‌, తెలంగాణ పౌరులకు ఏం సంబంధమని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అంటున్నారు. తెలంగాణ యువకులు కశ్మీర్‌కోసం ప్రాణాలను కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన గుర్తించాలి. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే కశ్మీర్‌లో రక్తం ఏరులై పారుతుందని రాహుల్‌గాంధీ అన్నారు. కానీ కంకర రాయి విసిరే సాహసం కూడా ఎవరూ చేయలేదు. అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370 మళ్లీ తీసుకువస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. ఆ పార్టీ అధికారంలోకి రావడం కలే. భాజపా ఉండగా దేశంలో పీఎఫ్‌ఐ వంటి ఉగ్రసంస్థలకు మనుగడ ఉండదు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో ముస్లిం సోదరీమణులు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముస్లిం పర్సనల్‌ లా, ట్రిపుల్‌ తలాక్‌ను అమలు చేస్తుంది. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఖర్గే, సోనియా, రాహుల్‌కు ఆహ్వానాలు అందాయి. కానీ వాళ్లు ఓ వర్గం ఓటు బ్యాంకుకు భయపడి రాలేదు. ఈ ఎన్నికలు మోదీని మరోసారి ప్రధానిని చేసేవి. భాజపా అభ్యర్థులకు కమలం గుర్తుపై వేసే ఓటు నేరుగా మోదీని ప్రధానిని చేస్తుంది. భాజపాకు 400 సీట్లు రావాలి. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 100 సీట్లకు పైగా వస్తాయి.

భాజపాను గెలిపించి కాంగ్రెస్‌ ఏటీఎంలో డబ్బు లేకుండా చేద్దాం

తెలంగాణను కాంగ్రెస్‌ ఏటీఎంగా మార్చుకుంది. దేశంలో జీఎస్టీ అమల్లో ఉందని ఇక్కడ రాహుల్‌గాంధీ, రేవంత్‌ ట్యాక్స్‌ (ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌) వసూలు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ రూపంలో తెలంగాణ నుంచి రూ.కోట్లు దిల్లీకి తరలిపోతున్నాయి. తెలంగాణను ఏటీఎంగా మార్చుకుని కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎన్నికల్లో పోరాడుతోంది. భాజపాను గెలిపించి కాంగ్రెస్‌ ఏటీఎంలో డబ్బులేకుండా చేద్దాం.

అవినీతి మరకలేని మోదీ... రూ.12 లక్షల కోట్ల కుంభకోణం చేసిన కాంగ్రెస్‌

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 57 సీˆట్లు కూడా రావు. 23 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రధానిగా పనిచేసి 25 పైసల అవినీతి మరకలేని ప్రధాని నరేంద్రమోదీకి, రూ.12 లక్షల కోట్ల కుంభకోణం చేసిన కాంగ్రెస్‌కు మధ్య పోటీ అని ప్రజలు గుర్తించాలి. ఎన్నికల్లో ఒకవైపు ఆగర్భశ్రీమంతుడైన రాహుల్‌ గాంధీ.. మరోవైపు చాయ్‌వాలా మోదీ ఉన్నారు. పేదలకు న్యాయం చేసే మోదీ కావాలో.. రాహుల్‌ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రధాని దీపావళి రోజున సరిహద్దుల్లో సైనికులతో గడుపుతారు... కానీ ఉష్ణోగ్రతలు పెరిగితే రాహుల్‌గాంధీ మాత్రం బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌ యాత్రలకు వెళ్తారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌, సోనియా, రాహుల్‌గాంధీ.. ఇలా నాలుగు తరాలు పేదరిక నిర్మూలనకు గరీబీ హఠావో నినాదం ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదు. ఇండి కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు.. పవారా? మమతానా? స్టాలినా? ఉద్ధవ్‌ఠాక్రేనా లేదంటే రాహల్‌గాంధీనా? కరోనా వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ రాజకీయం చేశారు. చివరకు ఓ రాత్రి ఆయన వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ దేశాన్ని సురక్షితంగా ఉంచే పనులు చేస్తారు.

రాష్ట్రంలో కేంద్రం ద్వారా ఎన్నెన్నో అభివృద్ధి పనులు

తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎంత అందాయో చెప్పాలని మాజీ సీఎం కేసీఆర్‌ లెక్కలు అడుగుతున్నారు. ఆ లెక్కలు ఇస్తాం కానీ లిక్కర్‌ స్కాంలో మీరు తిన్నది ఎంతో చెప్పాలి. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో కొత్తగా 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు, రీజినల్‌రింగ్‌ రోడ్‌, ఎంఎంటీఎస్‌ రెండో దశ, ఆరువేల కోట్ల పీఎంజీఎస్‌ రోడ్లు, రూ.26 వేల కోట్లతో రైల్వేల అభివృద్ధి, రూ.వెయ్యి కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, చర్లపల్లి కొత్త రైల్వేటర్మినల్‌ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పసుపురైతులకు మంచి ధర లభించేలా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు సహా అనేక అభివృద్ధి పనులు చేస్తోంది. అన్నీ అనుకూలంగా ఉంటే మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిచి రైతులకు మేలు చేయడంతో పాటు సహకార విధానంలో నిర్వహిస్తాం. మోదీ సారథ్యంలోని భారత్‌ మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది’’ అని అమిత్‌షా వివరించారు. ఈ సభల్లో అభ్యర్థులతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సహా పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.


  • దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కుంభకోణాలకు లెక్కే ఉండదు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఆ పార్టీ ఏళ్లకు ఏళ్లు ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌, రామజన్మభూమి అంశాలను తొక్కిపెడుతూ జాప్యం చేసింది. మోదీ వీటన్నింటినీ సాధించి చూపారు.
  • తెలంగాణలో ఏబీసీలు ఒకటయ్యాయి. ఏబీసీ అంటే అసదుద్దీన్‌(ఎంఐఎం), భారాస, కాంగ్రెస్‌. అవి ఒక్కటై ముస్లిం ఓట్ల కోసం శ్రీరామనవమి శోభాయాత్రను అడ్డుకున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు.
  • 2014 నుంచి ప్రతి ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు ఓటు బ్యాంకు పెరుగుతోంది. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ వాటాను ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఇస్తాం. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.

అమిత్‌షా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img